మార్టినా హింగిస్. యూఎస్ ఓపెన్న టెన్నిస్ టోర్నీలో ఇద్దర భారతీయులతో జత కట్టి ఫైనల్ దాకా దూసుకుపోయింది. మహిళల డబుల్స్ లో సానియా మీర్జాతో జోడీ కట్టిన హింగిస్, ఫైనల్లో ప్రవేశించింది. మిక్స్ డ్ డబుల్స్ లో లియాండర్ పేస్ కు జోడీ కూడా హింగిసే ఈ జోడీ కూడా ఫైనల్లో ప్రవేశించింది. ఇలా రెండు విభాగాల్లోనూ టైటిల్ కు ఒక్క అడుగు దూరంలో ఉంది. మహిళల డబుల్స్ లో ఇప్పటికే సానియా, హింగిస్ జోడీ అనేక సంచలన విజయాలు సాధించింది. ఇప్పుడు యూఎస్ ఓపెన్ లోనూ ఎదురు లేని విజయాలతో దూసుకుపోతోంది. సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఇటలీ క్రీడాకారిణుల జోడీపై అవలీలగా నెగ్గింది. 6-4, 6-1 స్కోరుతో పెద్దగా ప్రతిఘటన లేకుండా విజయం సాధించి సానియా, హింగిస్ లు ఫైనల్లో ప్రవేశించారు. టైటిల్ కు చేరువయ్యారు.
మిక్స్ డ్ డబుల్స్ లో లియాండర్ పేస్, హింగిస్ జోడీ ఫైనల్ కు చేరింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వీరు సెమీస్ లో మరో భారతీయుడు బోపన్న జోడీని ఓడించారు. బోపన్న ఈసారి ఓ తైపీ క్రీడాకారిణితో జోడీగా ఆడుతున్నాడు. పేస్, హింగిస్ జోడీ సెమీస్ లో 6-2, 7-5తో విజయంస సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. బోపన్న జోడీ రెండో సెట్లో గట్టి పోటీ ఇచ్చినా ఓటమిపాలైంది. భారత్ కు చెందిన ఇద్దరికి హింగిస్ జోడీగా ఉంటూ విజయ పథంలో దూసుకుపోవడం టెన్నిస్ చరిత్రలో అరుదైన విషయం. టెన్నిస్ ప్రపంచంలో చివరి గ్రాండ్ స్లాం టోర్నీ అయిన యు ఎస్ ఓపెన్ లో టైటిల్ గెలవడం ఓ మధురానుభూతి. ఈసారి సానియా జోడీ, పేస్ జోడీ అయిన హింగిస్ డబుల్ ధమాకా సాధిస్తుందేమో చూడాలి.