పవన్ కల్యాణ్ స్టామినా వేరు. ఎన్ని ఫ్లాపులు వచ్చినా ఆ రేంజు వేరు. ఈ విషయం కాటమరాయుడుతో మరోసారి రుజువైంది. డాలీ దర్శకత్వం వహించిన కాటమరాయుడు తెలుగులో ఫ్లాప్! పవన్ ఫ్యాన్స్కి సైతం పెద్దగా నచ్చలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాని డబ్ చేసి వదిలారు. యూ ట్యూబ్లో నాలుగు రోజుల క్రితం పోస్ట్ చేసిన ఈ సినిమాకి ఇప్పటికే కోటి వ్యూస్ వచ్చాయి. పవన్ సినిమాల్ని హిందీ ఛానళ్లు డబ్బింగ్ రూపంలో ప్రదర్శిస్తుంటాయి. వాటికి మంచి రేటింగులు వస్తుంటాయి. పవన్ అభిమానులు తమిళనాడు, కేరళ, ముంబైలోనూ ఉన్నారు. వాళ్లంతా హిందీ డబ్బింగ్ సినిమాల్ని తెగ చూస్తుంటారు. బాలీవుడ్ వాళ్లకి సౌత్ ఇండియన్ యాక్షన్ సినిమాలపై మోజుంది. అందుకే.. ఇటు నుంచి వెళ్లిన డబ్బింగ్ సినిమాలకు టీవీ ఛానళ్లకు మంచి రేటింగులు వస్తున్నాయి. పవన్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ సినిమాలు హిందీ ఛానళ్లలో డబ్బింగ్ రూపంలో విరివిగా ప్రదర్శితమవుతున్నాయి. బన్నీ సరైనోడుకి అదిరిపోయే వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు పవన్ కల్యాణ్ సినిమా దుమ్ము రేపుతోంది. స్టార్ హీరోల సినిమాలన్నీ హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో కోట్లు దండుకొంటున్నాయి. పవన్, బన్నీ, ఎన్టీఆర్ సినిమాలకు అక్కడ రూ.7 కోట్ల నుంచి 9 కోట్లు పలుకుతున్నాయి. కాటమరాయుడునీ భారీ రేట్లకే కొన్నారు. ఆ ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. కాటమరాయుడు తెలుగు వెర్షన్ ఇంకా యూట్యూబ్లో పెట్టలేదు. దాంతో.. ఇక్కడి పవన్ ఫ్యాన్స్ కూడా పవన్ హిందీలో డైలాగులు చెబుతుంటే చూసుకొంటూ తెగ ఖుషీ అయిపోతున్నారు.