ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్సిపి నేత జగన్మోహనరెడ్డికి కేసులు కోర్టులు నిత్య జీవితంలో భాగమై పోయాయి. ఎప్పుడూ ఏదో ఒకటి నడుస్తూనే వుంటుంది. రకరకాల అభ్యర్థనలు వివిధ స్థాయిల కోర్టుల్లో విచారణకు వస్తుంటాయి. అందులో ఏదో ఒక దాంట్లో ఆయన వాదన వీగిపోవడం, కోర్టులో చుక్కెదురు అని మీడియా కథనాలివ్వడం షరా మామూలే. ఇప్పటికే 11 కేసుల్లో నిందితుడుగా వుండి 16 నెలలు జైలులో విచారణఖైదీగా వుండి వచ్చిన వ్యక్తికి కొత్తగా పోయేదేముంటుంది? ఈ కేసులన్నిటినీ కలిపి ఒకేసారి విచారణ జరిపేలా ఉత్తర్వులివ్వాలని ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. దాన్ని డిస్మిస్ చేస్తామని చెప్పగా వారే ఉపసంహరించుకున్నారు. దీంతో జగన్ రాజకీయ భవిష్యత్తే తలకిందులై పోతుందన్నట్టు ఆయన పాదయాత్ర కూడా ఆగిపోతుందన్నట్టు కొన్ని ఛానళ్లు కథనాలు మొదలుపెట్టాయి. ఈ తీర్పు ఆయనకు వ్యతిరేకం అనడంలో సందేహం లేదు గాని తర్వాత ఏం చేస్తారు? పైకి వెళ్లే ప్రయత్నం చేస్తారా లేదా సిబిఐ కోర్టుల తీరుతెన్నులు ఎలా వుంటాయి వంటి అనేక ప్రశ్నలకు సమాధానం రావలసి వుంటుంది. టిడిపికి సంబంధించిన న్యాయవాద నాయకులు కూడా ఆ మాట అంటూనే ఇక ఆయన రోజూ కోర్టుల చుట్టూ తిరగాల్సివుంటుందన్నట్టు మాట్లాడ్డం రాజకీయ వ్యతిరేకతనే తెల్పుతుంది. ఎందుకంటే జయలలిత కేసుతో సహా చాలా కేసుల్లో లెక్కలేనన్ని మలుపులు చూశాం. రేపు మరో కోర్టులో మరో న్యాయమూర్తి ఎలా ఆలోచిస్తారో ఎలంటి ఆదేశాలిస్తారో ఎవరు చెప్పగలరు? ఎప్పటికప్పుడు ఇదే ఎండ్ ఆఫ్‌ద రోడ్ అనడం వల్ల కలిగే ప్రయోజనం వుండదు. అయిదేళ్లుగా చూస్తున్న వాస్తవం అది. కోర్టులూ సిబిఐ రాజకీయాలు అన్నీ ఆశ్చర్యకరంగానే వుంటాయి.