చదువు పేరుతో వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతోంది. అడ్డగోలుగా ఫీజుల వసూలు దశను దాటి, కాన్సెప్ట్ డిపాజిట్ల పేరుతో లక్షల వసూలు చేసే దశకు చేరింది. కేశవరెడ్డి విద్యా సంస్థల యజమాని నిర్వాకం ఈ విషయాన్ని తేటతెల్లం చేసింది. ఒక్క విద్యార్థిని పొరపాటున ఓ మంచి ర్యాంకు వస్తే, పత్రికల్లో టీవీల్లో ప్రకటనలు గుప్పిస్తే, ఇక ఆ విద్యా సంస్థలో అడ్మిషన్ల వరద. ఒక్క విద్యార్థి సొంత ప్రతిభతో సాధించిన ర్యాంకే ఆ స్కూల్ కి, కాలేజీకి పెట్టుబడి అవుతుంది.
అనేక బడా కార్పొరేట్ విద్యాసంస్థలు తెలివైన కొందరు విద్యార్థులను ఫీజుల్లేకుండా చేర్చుకుని, వాళ్లు సాధించే ర్యాంకులను తమ ఖాతాలో వేసుకుంటాయి. భారీగా యాడ్స్ ఇస్తుంటాయి. ఇది చూసి పిల్లల తల్లిదండ్రులు ఎగబడి అడిషన్ల కోసం ఆరాటపడతారు. ఆ విద్యా సంస్థలో చేరితో తమ పిల్లలు కూడా ర్యాంకులు సాధిస్తారని ఆశపడతారు. నిజానికి, ఆ విద్యా సంస్థలో మొత్తం ఎంత మంది పదో తరగతి లేదా ఇంటర్ పరీక్షలు రాశారు, వారిలో ఎంత మందికి మంచి మార్కులు వచ్చాయి, ఎంత మంది ఫెయిలయ్యారనే వివరాలను తెలుసుకోవాలనే ధ్యాసే పేరెంట్స్ కు ఉండదు. నిజంగా వారు ఈ వివరాలు తెలుసుకుంటే గుండెలు బాదుకుంటారు. ఎందుకంటే, పలు కార్పొరేట్ విద్యా సంస్థల్లో అత్తెసరు మార్కులు వచ్చిన వారు, ఫెయిలైన వారి శాతమే ఎక్కువ.
ఈ వాస్తవాలు తెలుసుకోకుండా గుడ్డిగా తమ పిల్లలను వాటిలో చేర్పిస్తారు. భారీగా ఫీజులు, డొనేషన్లు కడతారు. చివరకు కేశవరెడ్డి తరహాలో లక్షలు డిపాజిట్ చేయడానికి కూడా సిద్ధపడతారు. ఒక్కమాటలో చెప్పాలంటే, పేరెంట్స్ మోసపోవడానికి సిద్ధంగా ఉంటారు. బలి ఇచ్చే మేకల్లా కనిపించే వీరిని విద్యా సంస్థలు మోసం చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. పిల్లల్ని చేర్పించేటప్పుడు ఇరుగు పొరుగు ప్రభావం కూడా ఎక్కువే. ఫలానా పెద్ద స్కూల్ లో మా పిల్లలు చదువుతున్నారని గొప్పలు చెప్పుకోవడానికి ఆరాట పడే తల్లిదండ్రులూ ఉన్నారు. బడా విద్యాసంస్థల్లో ఆటపాటల అడ్రస్ ఉండదు. రోజుకు పదిహేను పదహారు గంటలు బట్టీ పట్టే చదువు.
ఆటపాటలకు పిల్లలను దూరం చేయడం ఎంత అన్యాయమో తల్లిదండ్రులు ఆలోచించరు. పిల్లలను మార్కులు సాధించే యంత్రాల్లా చూస్తారు. స్వయంగా తామే పిల్లల పట్ల విలన్లుగా ప్రవర్తించే తల్లిదండ్రులు చాలా మందే ఉన్నారు. ఆటపాటలు లేని బాల్యం అందమైన బాల్యం కాదనే ఆలోచన వీరికి రాదు.
ఇక్కడ ఒక్క ప్రశ్న. క్లాస్ లో 50 ఉంటే అందరూ ఫస్ట్ ర్యాంక్ సాధిస్తారా? ఉన్నంతలో శ్రద్ధగా పాఠాలు చెప్పే మధ్య స్థాయి విద్యా సంస్థల్లో పిల్లల్ని చేరిస్తే తప్పా?
చెల్లని రూపాయికి గీతలెక్కువ అని తెలియదా? అడ్డగోలు ప్రకటనలకు కోట్లు ఖర్చు పెట్టే సంస్థల్లో విద్యానాణ్యత అనుమానాస్పదమనే చిన్నపాటి అనుమానం కలగదా?
టాప్ ర్యాంక్ రాకపోతే ప్రాణం పోతుందా? తక్కువ మార్కులు రావడం నేరమా? బిల్ గేట్స్ ఇంటర్ కూడా పాస్ కాలేదు. ఇప్పుడు మనం ప్రతిక్షణం ఉపయోగించే వాట్సాప్ కనిపెట్టిన ఇద్దరు యువకులూ ఇంటర్ ఫెయిలయ్యారు. పైగా తమకు ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకోని ఫేస్ బుక్ కంపెనీకే వాట్సాప్ యాప్ ను లక్ష కోట్లకు అమ్మారు.
ప్రతిభ అనేది వివిధ రంగాల్లో ఉంటుంది. వాటిలో విద్యా రంగం ఒకటి మాత్రమే. ఇదే ప్రపంచం కాదు. సచిన్ లు, బిల్ గేట్స్ లు, ధీరూభాయ్ అంబానీలు, జి. పుల్లారెడ్డిలూ వేస్టా? వారు పనికిమాలిన వారా?
విద్యా సంస్థల ర్యాంకర్ల ప్రకటనలే కాదు, ఫెయిలైన వారి వివరాలు కూడా తెలుసుకుని తల్లిదండ్రులు నిర్ణయం తీసుకోవాలి. ఆరోజు వచ్చినప్పుడు, కేశవరెడ్డి వంటి విద్యాసంస్థల ఆటలు సాగవు.