డ్రగ్స్ కేసులో వరుసగా ప్రముఖుల విచారణలు సాగుతున్నాయి. రెండో రోజు సినిమాటోగ్రఫర్ శ్యామ్. కె నాయుడుని విచారించారు. మూడో రోజు నటుడు సుబ్బరాజు విచారణకు హాజరు కాబోతున్నారు. అయితే, ఈ కేసుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ఓ కామెంట్ ఆసక్తికరంగా మారింది. చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కుప్పం ప్రజలు తనపై చూపుతున్న అభిమానాన్ని మాటల్లో వివరించలేనని సీఎం అన్నారు. అందుకే, అభివృద్ధి కార్యక్రమం ఏదైనా ఇక్కడి నుంచే ప్రారంభిస్తానని చెప్పారు.
పిల్లలకు ఆస్తులు ఎంత పోగేసి ఇచ్చామన్నది ముఖ్యం కాదనీ, వాళ్లని ఎంత చదివించాం అనేది ముఖ్యమని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. ఆస్తులు ఎక్కువ అయితే దురలవాట్లే వస్తాయనీ, అందుకు నిదర్శనమే డ్రగ్స్ వ్యవహారమని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా బెల్టు షాపులపై కూడా స్పందించారు. వాటి జాడ ఎక్కుడున్నా ఉపేక్షించేది లేదని సీఎం స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ ఉద్దేశంతో స్పందించారోగానీ… కొన్ని విమర్శలకు తావిచ్చేలానే ఆయన కామెంట్స్ ఉన్నాయి. డబ్బు ఎక్కువైతే దురలవాట్లే వస్తాయని జనరలైజ్ చేస్తూ వ్యాఖ్యానించారు. అంటే, డబ్బున్నవాళ్లంతా దురలవాట్లకు బానిసలు కారు కదా! దురలవాట్లకు దారి తీసే కారణాల్లో డబ్బు ఎక్కువ ఉండటం అనేది ఒకటి కావొచ్చు. చంద్రబాబు చెప్పాలనుకున్న ఉద్దేశం కూడా ఇదే అయి ఉండొచ్చు. కానీ, ఇంకాస్త క్లారిటీగా మాట్లాడి ఉంటే బాగుండేది.
ఇదే కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ… విద్య వల్ల సామాన్యులు కూడా అసామాన్యులుగా ఎదుగుతారని చెప్పారు. తెలుగువాడైన సత్య నాదెండ్ల మైక్రోసాఫ్ట్ కి సీయీవో అయ్యారన్నారు. అలాగే, తమిళనాడు వచ్చిన సుందర్ పిచాయ్ గూగుల్ కంపెనీకి సీయీవో గా సేవలందిస్తున్నారు అన్నారు. వీళ్ల సంపాదన చూస్తుంటే రూ. 500 కోట్లు, రూ. 1000 కోట్లు సంవత్సరానికి ఉంటోందన్నారు. ఒకే సభలో మాట్లాడిన ఈ రెండు విషయాలను వినేవారు లింక్ చేసుకునే అవకాశం ఉంటుంది. డబ్బు ఎక్కువ కావడం వల్ల దురలవాట్లు వస్తాయని చెప్పిన ఆ కార్యక్రమంలోనే… ఏడాదికి వెయ్యి కోట్లు సంపాదించుకుంటున్నారని చెప్పడం.. పరస్పర విరుద్ధ వ్యాఖ్యలుగా అనిపిస్తున్నాయి! వారి జీతాలు ఎక్కువగా వస్తున్నాయని గొప్పగా చెప్పి ఉండొచ్చు. కానీ, డబ్బు ఎక్కువ అనే టాపిక్ పై ముందుగా మాట్లాడి… తరువాత, ఈ భారీ జీతాల గురించి ప్రస్థావిస్తే.. రెండూ రిలేట్ చేసుకునే ఛాన్సులే ఎక్కువగా ఉంటాయి.