ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకోవడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అలవాటు అంటుంటారు! ప్రభుత్వ పనితీరు మీదా, నాయకుల విధి నిర్వహణ మీదా సర్వేలు చేస్తుంటారు. అయితే, ఆ ఫలితాలు వెల్లడించే క్రమం ఎలా ఉందో తెలియాలంటే… తాజా సర్వే ఫలితాలను ఒక్కసారి చూడాల్సిందే. ఎన్ని సర్వేలు చేయిస్తున్నా ఇంకా ఏదో మిస్సింగ్ అనే అసంతృప్తి సీఎంలో ఉందనీ, అందుకే దేశంలోని ప్రముఖ సెఫాలజిస్టులను పిలిపించి తాజాగా ఓ సర్వే చేయించారట. ఆ సర్వే ప్రకారం ఎమ్మెల్యేల పనితీరు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని తేలింది!
తాజా సర్వేలో మూడేళ్ల టీడీపీ పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు అనే అంశంపై ఎక్కువ శ్రద్ధ పెట్టారు. ముఖ్యమంత్రి పనితీరు… శాసన సభ్యుల పనితీరుపైనే క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున శాంపిల్స్ తీసుకున్నారట. దీంతోపాటు ప్రభుత్వ పథకాల అమలు తీరుపై కూడా ఆరా తీశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పనితీరు భేషుగ్గా ఉందంటూ దాదాపు 76 శాతం మంది పరిపూర్ణ సంతృప్తిని వ్యక్తం చేశారనీ సర్వేలో తేలినట్టు చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల దృష్ట్యా, ఆర్థిక సమస్యల దృష్ట్యా చంద్రబాబు సీఎంగా ఉండటమే మంచిదైందని ప్రజలు అభిప్రాయపడుతున్నారట. రాష్ట్రం కోసం చంద్రబాబు చాలా కష్టపడుతున్నారనీ, ఆయన సమర్థ నాయకుడని సర్వేలో తేలిందని చెప్తున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే పనితీరుపై సర్వే ఫలితాలు మరోలా ఉన్నాయి. దాదాపు 60 శాతం మంది ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలు అసంతృప్తి వ్యక్తపరచారట! కొన్ని స్థానాల్లో కొత్తవారిని నిలబెట్టినా ఓటమి ఖాయం అనే రేంజితో ఎమ్మెల్యేల పనితీరు ఉంటోందని సర్వేలో తేలినట్టు తెలుస్తోంది. ఈ సర్వేను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమూలాగ్రం పరిశీలించారనీ, పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలను త్వరలోనే పిలిపించి మాట్లాడతారంటూ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సర్వే పరిశీలించిన తరువాత… ఇకపై పార్టీ మేనేజ్మెంట్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చంద్రబాబు డిసైడ్ అయినట్టు చెబుతున్నారు.
ఒక్కసారి ఈ ఫలితాల వెల్లడిని జాగ్రత్తగా గమనిస్తే.. ముఖ్యమంత్రి పనితీరుపై ప్రజలు సంతృప్తిగానే ఉన్నారని తేలిందని చెప్పారు, అది ఊహించిందే! కానీ, ఎమ్మెల్యేల పనితీరు దారుణంగా ఉందని ప్రజలు అంటున్నట్టు వెల్లడించడమే విడ్డూరం! ఎందుకంటే, ఎమ్మెల్యేల పనితీరు బాగులేదంటూ ప్రభుత్వ పనితీరు బాగులేనట్టే కదా! ఆ లెక్కన ముఖ్యమంత్రి పనితీరూ కూడా అంతే అన్నట్టు కదా! ఎమ్మెల్యేల పనితీరు వేరు.. ముఖ్యమంత్రి పనితీరు వేరు ఎలా అవుతుంది..? ముఖ్యమంత్రిగా ఏయే పథకాలను అయితే ప్రవేశపెడతారో వాటినే ఎమ్మెల్యేలు అమలు చేస్తారు. అప్పుడు పథకాలు తీరు భేషుగ్గా ఉందనీ, ఎమ్మెల్యేల పనితీరు మాత్రం బాగులేదని విడివిడిగా ఎలా చూస్తారు..?
తెలంగాణలో కూడా ఇలాంటి సర్వేలే ఈ మధ్య బయటకి వచ్చాయి. సీఎం కేసీఆర్ పనితీరు అద్భుతః అని ప్రజలు అంటున్నారు, కానీ.. ఎమ్మెల్యేల పనితీరు బాగులేదని ప్రజలు మూతివిరుస్తున్నారట! ఎమ్మెల్యేలందరి పనితీరూ కలిస్తేనే కదా ముఖ్యమంత్రి పనితీరు అవుతుంది. అంటే, ముఖ్యమంత్రులు సొంతంగా చేయించుకునే సర్వేల ఫలితాలు ఇలానే ఉంటాయేమో మరి! ఎమ్మెల్యే పనితీరు అద్భుతం.. ముఖ్యమంత్రే సరిగా పనిచేయడం లేదని ఏ సర్వేలోనూ ఒక్కసారైనా ఎందుకు తేలడం లేదు..?