హైదరాబాద్ డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటికే చాలా సంచలనాలు వచ్చాయి. కొత్తగా వచ్చేవి వుండబోవని ఇది వరకే నేను వ్యాఖ్యానించాను. ఈ సమయంలో రామ్గోపాల్ వర్మ ఏవో వ్యాఖ్యలు చేయడంతో ఎక్సయిజ్శాఖ వాటిని ఖండించేపేరిట రంగంలోకి దిగింది. తాము చిత్ర పరిశ్రమను మాత్రమే లక్ష్యంగా చేసుకోలేదని ఎక్సయిజ్ కమిషనర్ చంద్రవదన్ వివరణ ఇచ్చారు. అసలు నిందితులను ఇంటరాగేట్ చేసే సమయంలో చంద్రవదన్ వుండటంపైనే కొందరు అభ్యంతరం వెలిబుచ్చారు. ఇప్పుడు కేసుపై బ్రీఫింగ్ కూడా ఇవ్వడమంటే మరో అడుగు వేశారన్నమాట. అయితే ఇంతవరకూ అన్ని వివరాలు చెబుతూ వస్తున్న అకున్ సబర్వాల్ మాత్రం పక్కన వుండిపోయారు. మీడియా అడిగినా ఆయన స్పందించేందుకు నిరాకరించారు. దీనివల్ల ఆరోపణలను బలపర్చినట్టవుతుందని మీడియా వారు వ్యాఖ్యానించినా ఆయన స్పందించడానికి నిరాకరించారు. దీన్నిబట్టి చూస్తే శాఖా పరంగానూ అధికారుల వ్యక్తుల ప్రాధాన్యతలు ప్రచారాలపై తేడాలున్నట్టు అర్థమవుతుంది. పెద్దగా ఆధారాలు దొరకలేదన్న సంకేతాలు ఒకవైపు వస్తుంటే ఇంకా ఏదో గొప్పగా సమాచారం లభించినట్టు మరోవైపు కథనాలు వదలడం వ్యూహాత్మకమే కావచ్చు. పైగా ప్రజల దృష్టిని ఆకర్షి:చిన ఈ అంశంపై మరికొంత కాలం వార్తలకు వూహలకు అవకాశం ఇవ్వడమే మంచిదని అధికారులు భావిస్తున్నట్టున్నారు. అయితే ఈ హడావుడి ఎంత చేసినా రేపు మళ్లీ న్యాయస్థానాల్లో నిరూపించవలసే వుంటుంది. అప్పటివరకూ జరిగేది మీడియాకు మాత్రమే అక్కరకు వస్తుంది.