టాలీవుడ్‌ని ఆకర్షిస్తున్న ప్రేమ జంట.. నాగచైతన్య – సమంత. అక్టోబరు 6న గోవాలో వీరిద్దరి పెళ్లి జరగబోతోంది. పెళ్లయ్యాక.. ఇక హనీమూనే కదా? ఆ విషయంపైనా సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చ సాగుతోంది. హనీమూన్‌లో భాగంగా 40 రోజుల పాటు వరల్డ్ టూర్ ప్లాన్ చేసినట్టు… ప్రపంచ దేశాలన్నీ చుట్టి రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై సమంత స్పందించింది. హనీమూన్ ప్లానింగ్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదని, పెళ్లయిన మూడో రోజే షూటింగ్లో పాల్గొనడానికి కాల్సీట్లు ఇచ్చానని చెబుతోంది సమంత. సమంత కథానాయికగా రంగస్థలం, మహానటి, రాజుగారి గది 2 చిత్రాలు తెరకెక్కుతున్నాయి. తమిళంలోనూ కొత్త ప్రాజెక్టులు ఒప్పుకొంటోంది. అందుకే.. సమంతకు తీరిక లేకుండా పోతోంది. పెళ్లికి వారం రోజులే సెలవు పెట్టిందట. ”నా వ్యక్తిగత జీవితంతో పాటు సినిమాలు కూడా నాకు ముఖ్యమే. రెండింటినీ బాలెన్స్ చేసుకొంటాననే అనుకొంటున్నా. ఈ విషయంలో చైతూ సపోర్ట్ నాకు బాగా ఉంది. హనీమూన్ గురించి ఇద్దరం ఏం ఆలోచించలేదు. పెళ్లయ్యాక మాకు అనిపిస్తే.. అప్పుడు ప్లాన్ చేసుకొంటాం” అంటోంది సమంత.