శవం తమ్ముడిదే అయినా కంపు కామనే… అన్నా… 1990 దశకంలో వచ్చిన ఓ సినిమాలో ప్రఖ్యాతమైన డైలాగ్ ఇది. డ్రగ్స్ వ్యవహారంలో హీరో తరుణ్ సిట్ ముందు…సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ సాధారణమేనని.. వ్యాఖ్యానించడం దీన్నే సూచిస్తోంది. విలువల వలువలు విప్పేసి, వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా పనిచేస్తున్న సినిమా ఇండస్ట్రీకి ఈ పరిస్థితి వస్తుందని ఎన్నడూ ఊహించలేదు. వాళ్ళ గొడవేదో వాళ్ళు పడుతున్నారులే.. .మనకు వినోదం చాలులే అనుకున్న అభిమానులు తాజా పరిణామాలతో నిరాశోపహతులవుతున్నారు. తమ అభిమాన హీరోలు డ్రగ్స్‌కు బానిసలవడమే కాక, వ్యాపారం కూడా చేస్తున్నారంటూ సిట్ విచారణకు హాజరైన ప్రముఖులు చెబుతున్నారంటూ పత్రికల్లో వస్తున్న వార్తలు వారికి ఊపిరాడనీయడం లేదు. దర్జాగా విచారణకు హాజరవుతూ, తమకు తెలిసిన విషయాలు చెప్పేసి, తప్పొప్పేసుకుని, లెంపలేసేసుకుంటే ఒగ్గేస్తారనే వైఖరి వారిలో కనిపిస్తోంది.
నిజమే.. విపరీతమైన కష్టానికీ, శ్రమకూ లోనయ్యే సినీ పారిశ్రామికులు దాన్నుంచి ఉపశమనం పొందడానికి సాధనంగా డ్రగ్స్‌ను ఆశ్రయిస్తున్నారని తేలుతుండడం సమాజానికి శరాఘాతమే. ఉబ్బితబ్బిబ్బు చేసే అభిమానం వారికి కిక్ ఇవ్వడం లేదు. పబ్బులలో వీరికోసం ప్రత్యేకంగా రహస్య గదులను ఏర్పాటు చేశారట. అంటే పబ్బుల్లో సాగే అర్ధనగ్న తైతక్కలను ఆ గదుల్లోంచి వీక్షిస్తూ మత్తులో మునిగితేలుతారన్నమాట. దర్శకుడు పూరి జగన్నాథ్‌తో ప్రారంభమైన సిట్ విచారణ నిన్న తరుణ్ దగ్గర ఆగింది. వీరిద్దరితో పాటు నటుడు సుబ్బరాజు కూడా దిగ్భ్రాంతికరమైన వాస్తవాలను చెప్పారని మీడియా సంస్థల సమాచారం తెలియజేస్తోంది. మధ్యలో ఎక్సయిజ్ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌కు అంతర్జాతీయ మాఫియా నుంచి బెదిరింపులొచ్చాయన్న వార్తలు కలిగిస్తున్న కలవరం అంతాఇంతా కాదు. బెదిరించి ఓ నిజాయితీపరుడైన, డ్రగ్స్ మాఫియాకు పక్కలో బల్లెంలా మారిన అధికారిని సెంటిమెంటల్‌గా బ్లాక్ మెయిల్ చేయడానికి ఆ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. అకున్ సబర్వాల్ అంటే మామూలు అధికారి కాదు. కఠినతరమైన శిక్షణ నడుమ, దేశభక్తిని నిలువెల్లా కలిగున్న, నేరస్థుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తున్న అధికారి. దృఢచిత్తులను లొంగదీసుకోవడం అంత తేలిక కాదు. తనకు సెలవు మంజూరైనప్పటికీ, మీడియాలో వచ్చిన విమర్శల కారణంగా దానిని రద్దు చేసుకుని, విచారణ సాగిస్తున్న ఐపీఎస్ ఆయన.
ప్రస్తుత తరుణంలో ఆయనపై ఏ వత్తిడీ పనిచేయదని తేలిపోయింది. ఒక్కొక్క నటుడు కొంగ్రొత్త ఆధారాలను అందిస్తుండడం ఆయనకు సరికొత్త ఉత్సాహాన్ని అందిస్తోంది. ఈ విచారణపై మంత్రులు అడపా దడపా హుంకరించడం మినహా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకూ నోరుమెదపలేదు. ఆయన కూడా నోరువిప్పి, అకున్‌కు బాసటగా నిలిస్తే.. విశ్వనగరంగా మారదామనుకుంటున్న భాగ్యనగరినుంచి డ్రగ్స్ తరిమివేత అంత కష్టం కాదు. వీటికి అడ్డాగా మారిన పబ్స్, క్లబ్స్‌కు అనుమతులివ్వడంలో కచ్చితంగా వ్యవహరిస్తే…యువత భవితను కాపాడిన వారవుతారు.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి