కేంద్ర మాజీ మంత్రి, కాబోయే ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకీ, కేసీఆర్ కీ మధ్య ఉన్న వ్యాపార సంబంధాలు అందరికీ తెలిసినవే. తెరాసను ఎన్డీయే దగ్గరకి చేర్చేందుకు, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు విషయంలోనూ వెంకయ్య నాయుడు కృషికి కారణం ఆ బంధమే అనే విమర్శలూ వినిపించాయి. సరే, ఇవన్నీ గిట్టనివారి విమర్శలుగా కొట్టి పారెయ్యొచ్చు. తెలుగు రాష్ట్రాల కోసం జాతీయ స్థాయి నేతగా వెంకయ్య చేస్తున్న కృషిగా వాటి గురించి చెప్పుకోవచ్చు. అయితే, ఇప్పుడు తెరాస సర్కారు వెంకయ్య కుటుంబానికి చెందిన ట్రస్టుకు భారీ ఎత్తున మినహాయింపులు ఇస్తూ తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన జీవో ఎప్పుడో విడుదల అయిపోయినా… ఆ వివరాలను ఇన్నాళ్లూ ఎంతో రహస్యంగా ఉంచారంటూ ఓ ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక ఓ కథనం వెలుగులోకి తెచ్చింది.
స్వర్ణభారతీ ట్రస్ట్ ను వెంకయ్య నాయుడు ఫ్యామిలీకి చెందినవారు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ట్రస్టుకు దాదాపు రూ. 2 కోట్లను వివిధ మినహాయింపుల పేరుతో తెరాస ప్రభుత్వం కట్టబెట్టినట్టు ఆ కథనం పేర్కొంది. దీపా వెంకట్ కు చెందిన సర్ణభారతి ట్రస్ట్ కి డెవలప్మెంట్ ఛార్జీలు, ఓపెన్ స్పేస్ ఛార్జీలూ వంటి పేర్లతో రూ. 2.20 కోట్ల మినహాయింపులు ఇస్తూ జూన్ నెలలోనే ప్రభుత్వం జారీ చేసింది. ఇంతకీ ఈ మినహాయింపులు ఏ ప్రాతిపదిక ట్రస్టు వారు కోరారంటే… శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ సమీపంలో ఓ భవనాన్ని ట్రస్ట్ నిర్మించతలపెట్టింది. దీన్లో పేదలకు వైద్య సేవలు అందించడంతోపాటు, నైపుణ్యాల అభివృద్ధి – శిక్షణ కూడా ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే, ఈ భవనానికి ఎలాంటి మినహాయింపులూ ఇవ్వడం కుదరదనీ, అలాంటి వెసులుబాటు ఎక్కడా లేదనీ, ట్యుటోరియల్ బిల్డింగ్ కోసం రూ. 2.46 కోట్లను చెల్లించాల్సి ఉంటుందని హెచ్.ఎమ్.డి.ఎ. కమిషనర్ చెప్పారు. అయితే, ఈ ఏడాది మార్చి నెలలోనే మినహాయింపు కావాలంటూ ప్రభుత్వాన్ని ట్రస్ట్ కోరింది.
కోరినట్టుగానే జూన్ నెలలో జీవో వచ్చేసింది. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపులన్నీ పోగా, ట్రస్ట్ చెల్లించాల్సింది కేవలం రూ. 26 లక్షలే కావడం విశేషం! అంటే, ఏ రేంజిలో ఈ ట్రస్టుకు మినహాయింపులు దక్కాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంత పెద్ద మొత్తంలో ఒక ఎన్జీవోకి మినహాయింపులు ఇచ్చిన చరిత్ర గతంలో లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారట! మరి, లేని చరిత్ర ఇప్పుడు ఎలా మొదలైదంటే… వెంకయ్య నాయుడు కుటుంబంతో ఉన్న వ్యాపారానుబంధమే కారణమై ఉండొచ్చన్న విమర్శలూ ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఈ మినహాయింపులకు సంబంధించి ఎప్పుడో జూన్ లో జీవోని విడుదల చేసి, దాన్ని ఇన్నాళ్లూ రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి, ఈ అంశాన్ని ప్రతిపక్షాలు విమర్శనాస్త్రంగా మార్చుకునే అవకాశం స్పష్టంగానే కనిపిస్తోంది.