తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఏం చేసినా ఏం మాట్లాడినా అది అందరినీ ఆకర్షించడం సహజం. అందులోనూ రాజకీయ పాలనావసరాల కోసం ఆయన చేసే పనులు మరింత ప్రచారం పొందుతుంటాయి. ఈ విషయంలో నమస్తే తెలంగాణ ముందుటుందని చెప్పవనసరం లేదు. అలాటి పత్రికలో ఆదివారం నాడు ముఖ్యమంత్రికి సంబంధించిన అతి ముఖ్యమైన వార్త లేకపోవడం ఆశ్చర్యం కలిగించడమే గాక ఆసక్తి రేకెత్తించింది. రాష్ట్ర రాజకీయాలలో పెద్ద సంచలనంగా వున్న మల్లన్నసాగర్ పూర్తి చేయడం కోసం కెసిఆర్ స్వయంగా రంగంలోకి దిగి రైతులను రప్పించి మాట్లాడినా ఫలితం లేకపోవడం వల్లనే నమస్తే ఆ వార్త వదిలేసిందా? వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామాల రైతులు భూ సేకరణ పేరిట ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించారు, నెలల తరబడి నిరాహారదీక్షలు నిరసనలు చేస్తున్నారు. నీటిపారుదల మంత్రి హరీశ్ రావు వారిలో 80 శాతం మందిని ఒప్పించారని ఒక దశలో చెప్పారు గాని అవేమీ నిజం కాలేదు. తమ భూముల మార్కెట్ ధరను తక్కువ చూపించి పరిహారం , పునరావాస చర్యలు అరకొరగా చేస్తామంటే ఒప్పుకోబోమని ఆ రైతలు పోరాడుతున్నారు. ఇటీవల ప్రభుత్వం 2013 భూ సేకరణ చట్టాన్నే మార్చేసి తనకు అనుకూలమైన నిబంధనలు పొందుపర్చినా వారు మాట వినడం లేదు. ఈ నేపథ్యంలో కెసిఆర్ స్వయంగా రంగ ప్రవేశం చేసి ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి ఆ గ్రామ రైతులను పిలిపించి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ ఒక్క చోట పరిహారం పెంచలేము గాని డబుల్ బెడ్రూం ఇళ్లు గొర్రెల పంపిణీ వంటి సంక్షేమ చర్యలు విస్తారంగా అమలు చేస్తామని చెప్పి ఒప్పించేందుకు ప్రయత్నించారు. కాని వారు మాత్రం తమ భూములకు 2013 చట్టం ప్రకారం ఎకరాకు 20 లక్షలు పరిహారం వస్తుందని పదేపదే చెప్పారు. చాలా వరకు భూమి సేకరించాము గనక మీరు ఇవ్వకపోయినా కట్టితీరతామని కెసిఆర్ కరాఖండిగా చెప్పడంతో రైతులు కూడా అదే రీతిలో స్పందించారు. మాకు ఆమోదమయ్యేలా పరిహారం ఇవ్వకపోతే గుంజుకోండ్రి.. ఉట్టిగనే ఇస్తాం అని వారు గట్టిగానే బదులు చెప్పి వచ్చేశారు. ఇంకా తమకు జరుగుతున్న అన్యాయం గురించి, తలకిందులవుతున్న జీవితాల గురించి కూడా వివరంగానే చెప్పారట. పైగా తమ కోసం వండిన భోజనాలు కూడా చేయకుండానే వచ్చేశారు. ఈనాడు , నవతెలంగాణ మొదటి పేజీలో ప్రముఖంగా ఇచ్చిన ఈ వార్త నమస్తే తెలంగాణలో చోటు నోచుకోకపోవడం వింతగా లేదూ?