ఒకప్పుడు, ఏదైనా కుంభకోణం వెలికి తీయాలంటే మీడియా సంస్థలు ప్రధాన పాత్ర పోషించేవి. అధికార పక్షాన్ని కుదిపే స్థాయి స్కామ్ లను బయటకి లాగేవి. అవే ప్రతిపక్షాలకు ప్రధానాస్త్రాలు అయ్యేవి. కానీ, ఇప్పుడు కొన్ని మీడియా సంస్థల ఎడిటోరియల్ పాలసీలు చాలావరకూ మారిపోయాయి అనేది ఓపెన్ సీక్రెట్! అధికార పార్టీలకు కొమ్ము కాయడమే కొందరికి పనిగా మారింది! దీంతో స్కాములు బయటపెట్టుకునే పనిని కూడా అధికార పక్షమే తీసుకుంటోంది! కుంభకోణాలు జరిగాయని వారే ప్రకటించేసుకుంటారు.. పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటామనీ మళ్లీ వారే చెబుతుంటారు. నష్టం జరగకముందు గుర్తించలేని వైఫల్యాల్ని, జరిగాక తీసుకునే చర్యల పేరుతో కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖలో బయటపడ్డ గంజాయి అక్రమ రవాణా గురించి మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు.
ఓ పక్క తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతున్న తరుణంలో ఏపీ సర్కారు కూడా కాస్త అప్రమత్తమైంది. విశాఖ కేంద్రంగా జరుగుతున్న అక్రమ గంజాయి రవాణాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని వెనక పెద్ద మనుషులు ఉన్నారన్నారు. రాష్ట్రమే కాదు, దేశానికి వైజాగ్ నుంచే గంజాయి ఎగుమతి అవుతోందనేది ఓపెన్ సీక్రెట్ అన్నారు. దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందనీ, ఇదే విషయమై ఈ మధ్య క్యాబినెట్ లో కూడా చర్చించామన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సరదాగా చమత్కరిస్తూ ‘వైజాగ్ నుంచి దేశానికి గంజాయి పంపుతున్న క్రెడిట్ మనకు దక్కిందని అన్నారంటూ’ మంత్రి వివరించారు. అయితే, ఈ అంశాన్ని సీఎం చాలా సీరియస్ గా తీసుకున్నారనీ, ఒకరిద్దరు పంపిణీదారులపై కేసు పెట్టేసి చేతులు దులుపుకోవడం చాలదనీ, గంజాయి ఎక్కడ సాగు అవుతోందో, దీన్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో తెలుసుకుని చర్యలు చేపట్టాలని చంద్రబాబు చెప్పినట్టు మంత్రి అన్నారు. గతంలో కేజీల్లో గంజాయి పట్టుబడేదనీ, కానీ ఇప్పుడు టన్నులో దొరుకుతోందన్నారు గంటా. దీనిపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను పెట్టి చర్యలు తీసుకుంటామన్నారు.
గతంలో కేజీల కొద్దీ గంజాయి దొరుకుతూ ఉండేదనీ, ఇప్పుడు టన్నులకు చేరుకుందని మంత్రిగారే చెబుతున్నారు! కేజీల్లో పట్టుబడ్డప్పుడే టాస్క్ ఫోర్సులు పెట్టి ఉంటే, ఇవాళ్ల టన్నుల వరకూ వచ్చేది కాదు కదా! విశాఖ నుంచి పెద్ద ఎత్తున గంజాయి ఎగుమతి కావడం ఓపెన్ సీక్రెట్ అని గంటా చెప్పడం ఇంకా ఆశ్చర్యం! ఆ సీక్రెట్ ఇంత ఓపెన్ గా ఉంటే ఇన్నాళ్లూ పోలీసులు ఏం చేసినట్టు..? ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోనట్టు..? తెలంగాణలో డ్రగ్స్ కేసుపై చర్చ తీవ్రస్థాయిలో జరుగుతోంది కాబట్టి, మనమూ చర్యలకు దిగుదాం అన్నట్టుగా ఏపీ సర్కారు వైఖరి ఉన్నట్టుంది. గంజాయిని దేశానికి ఎగుమతి చేసే స్థాయి మన విశాఖకే దక్కిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చమత్కరించేంత చిన్న అంశమా ఇది..? దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించిన తీరు, మంత్రి గంటా వివరాలు వెల్లడించిన తీరే చెప్పకనే చెబుతోంది… మున్ముందు ఈ అంశంపై ఏ స్థాయిలో ప్రభుత్వ సీరియస్నెస్ ఉండబోతోందో అనేది..!