డ్రగ్స్ కేసుపై ఇప్పటికే టి. కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీడీపీ వంతు వచ్చింది! కేసీఆర్ కుటుంబ సభ్యులనే ప్రధానంగా టార్గెట్ చేసుకుని రేవంత్ విమర్శలు గుప్పించారు. కేసుల్ని పక్కతోవ పట్టించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు మించిన నాయకుడు మరొకరు ఉండరంటూ టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. మియాపూర్ భూ కుంభకోణంపై తాము పోరాటం చేస్తుంటే, అన్యాక్రాంతమైన భూముల సంగతి తేల్చి పేదలకి న్యాయం చేయాలని కోరుతుంటే… డ్రగ్స్ కేసు తెరపైకి తెచ్చారన్నారు. భూదందా నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇప్పుడీ కేసును వాడుకుంటున్నారు అన్నారు. పోనీ, ఈ కేసులోనైనా సక్రమంగా వ్యవహరిస్తున్నారా అంటే అదీ లేదని పెదవి విరిచారు. రాజకీయ అండలేనివారిపైనా, చిన్నివారిపైనే ప్రతాపం చూపిస్తున్నారనీ… డ్రగ్స్ వ్యవహారంలో పెద్దలకి ఎందుకు నోటీసులు అందడం లేదని ఆరోపించారు. కేటీఆర్ సన్నిహితులు చాలామంది ఈ దందాలో ఉన్నట్టు ఆరోపణలున్నాయి, వాటిని ఎందుకు పట్టించుకోవడం లేదని రేవంత్ ప్రశ్నించారు.
బార్లపై చర్యలు తీసుకుంటున్నట్టు గొప్పగా చెబుతున్నా, కేటీఆర్ స్నేహితులు, బంధువులు, ఇతర మంత్రులకు సంబంధించిన బార్లను వదిలేస్తున్నారన్నారు. ఈ విషయం తాను స్వయంగా అకున్ సబర్వాల్ కి ఫిర్యాదు చేస్తే, ఆయనపై ఏ ఒత్తిళ్లు ఉన్నాయో ఏమో, ఆయన స్పందనా ఆశించిన స్థాయిలో లేదని రేవంత్ ధ్వజమెత్తారు. పబ్ లకు నోటీసులు జారీ చేశామని గొప్పగా చెబుతున్న ఎక్సైజ్ శాఖ కూడా కేటీఆర్ బంధు మిత్రులకు చెందిన పబ్ లకు ఎందుకు మినహాయింపు ఇస్తోందని రేవంత్ ప్రశ్నించారు. డ్రగ్స్ మాఫియా హైదరాబాద్ లో విజృంభిస్తోందని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు, ఈ విషయాన్ని కేంద్ర నిఘా సంస్థలకు ఎందుకు లేఖలు రాయడం లేదన్నారు. డి.ఆర్.ఐ., నార్కోటిక్స్ వంటి కేంద్ర నిఘా సంస్థలకు ఈ కేసుల్ని ప్రభుత్వం ఎందుకు అప్పగించడం లేదని ప్రశ్నించారు? డ్రగ్స్ కేసు నేపథ్యంలో పబ్ ల వివరాలన్నీ కేసీఆర్ సర్కారు తెప్పించుకుంటోందనీ, అవన్నీ తమ వద్దే ఉంచుకుని, డ్రగ్స్ పేరుతో పబ్ యజమానులను బెదిరిస్తూ సొమ్ము వసూలు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ రేవంత్ ఆరోపించారు.
రేవంత్ ఆరోపణల్లో కొన్ని బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. డ్రగ్స్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఎందుకు అప్పగించడం లేదనేది మొదట్నుంచీ వినిపిస్తున్న విమర్శే. అలాగే, డ్రగ్స్ కేసులో చాలామంది సినీ పెద్దలు ఉన్నారని చెబుతున్నారేగానీ, కేవలం కొద్దిమందికి మాత్రమే నోటీసులు ఇచ్చారు. ఆ మిగతా ప్రముఖులు ఎవరనే చర్చ జనంలో ఉంది. వారి పేర్లు బయటకి రాకుండా కాపాడేందుకు కొంతమంది పెద్దలు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. నోటీసుల విషయంలో కూడా కొన్ని పబ్ లకు ఎందుకు మినహాయింపు ఇచ్చారనేదీ కీలక ప్రశ్నే. మొత్తానికి, డ్రగ్స్ కేసు రాజకీయ పార్టీల మధ్య విమర్శనాంశంగా మారింది. ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ కేసుపై తీవ్ర విమర్శలు చేసింది. కేటీఆర్ సన్నిహితులకు సంబంధం ఉండొచ్చంటూ దిగ్విజయ్ చేసిన ట్వీట్ తో రచ్చ అయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ స్థాయిలో విరుచుకుపడ్డారు. మరి, రేవంత్ ఆరోపణలపై తెరాస స్పందన ఎలా ఉంటుందో చూడాలి.