జూలై 11, 2006న ముంబైలో ఐదు వేర్వేరు లోకల్ ట్రైన్స్ లో జరిగిన వరుస బాంబు ప్రేలుళ్ళ కేసుని ‘ద స్పెషల్ మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజడ్ క్రైం ఆక్ట్’ క్రింద విచారిస్తున్న ప్రత్యేక కోర్టు ఈరోజు తీర్పు చెప్పింది. సుమారు 9 ఏళ్లగా సాగుతున్న ఈ కేసు విచారణలో ప్రత్యేక కోర్టు మొత్తం 12 మందిని దోషులుగా, ఒకరిని అబ్దుల్ వహీద్ షేక్ (34)ని నిర్దోషిగా నిర్దారించింది. ఈ 12 మంది కాకుండా మరో 14 మంది నేటికీ పోలీసుల నుండి తప్పించుకొని తీరుతున్నారు. వారిని కూడా ఎప్పటికయినా పట్టుకొని తీరుతామని పోలీసులు చెపుతున్నారు. కేవలం 10 నిమిషాల వ్యవధిలో ఐదు లోకల్ ట్రైన్స్ లో జరిగిన వరుస బాంబు ప్రేలుళ్ళలో మొత్తం 188 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా మరొక 829 మంది తీవ్రంగా గాయపడ్డారు. ముంబైలో ఖార్-శాంతాక్రజ్, బాంద్రా-ఖార్ రోడ్, జోగీశ్వరి-మహీం జంక్షన్, మీరా రోడ్-భయందర్, మాటుంగా-మహీం జంక్షన్-బోరివిల్లీ స్టేషన్ల మధ్య నడిచే ఐదు లోకల్ ట్రైన్స్ లోని ఏసి.బోగీల్లో చాలా శక్తివంతమయిన ఆర్.డి.యక్స్. బాంబులు అమర్చి పేల్చడంతో చాలా ప్రాణ నష్టం జరిగింది. మళ్ళీ సోమవారం నుండి దోషులకు శిక్షలు ఖరారు చేసేందుకు ప్రత్యేక కోర్టు విచారణ మొదలుపెడుతుంది.