ఇటీవలి కాలంలో సంచలనం కలిగిస్తున్న డ్రగ్స్ వినియోగం కేసులో ప్రభుత్వ విధానంపై చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయన్నది నిజమే. ముఖ్యమంత్రి సమీక్ష తర్వాత ఆ కేసులో జోరు తగ్గుతున్నట్టు కనిపిస్తున్నది. ఇక చలనమే గాని సంచలనం వుండదని నేను రాశాను. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన వారితో చర్చలోనూ పాల్గొన్నాను. అకున్ సబర్వాల్ సెలవు ఉపసంహరణ, విచారణ వివరాల వెల్లడి, టాలీవుడ్ స్పందనలు ఇవన్నీ ఒక ఎత్తు. రాజకీయంగా తప్పక లోపాలోపాలను విమర్శించవచ్చు గాని అసలు ఈ విచారణ ప్రక్రియనే తప్పుపట్టేలా కొందరు మాట్లాడ్డం ఆశ్చర్యం కలిగిస్తుంది. వారి వెనక వున్నది ఎవరు? వారి లక్ష్యం ఏమిటి? సినిమా వారినే అతిగా చూపించడం సరికాదు గాని బాధ్యత గల, అమిత ప్రచారశీలమైన సినిమా రంగ ప్రముఖులు తామే అనేక వివరాలు ఇవ్వడం మాఫియాకు మింగుడు పడలేదా? తీగలాగితే డొంక కదిలినట్టు విద్యార్థుల తలిదండ్రులు లేదా నేర నేపథ్యంలేని కొందరు నిందితులు వివరాలు చెప్పేస్తారని వీరు భయపడుతున్నారా? పూరీ జగన్నాథ్, శ్యాం కె నాయుడు వంటివారు వ్యవహరించిన దానికి తర్వాత మారుతున్న దృశ్యానికి మధ్య తేడా కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. రాజకీయాలలోనూ న్యాయవాద వృత్తిలోనూ నోరున్న కొందరు ఈ విచారణే తప్పయినట్టు వాదిస్తున్నారు. కోర్టులో కేసు వేశాక కూడా బయిట దాడి మొదలుపెట్టారు. కేవలం సినిమా వారే మాట్లాడినప్పటి కంటే రాజకీయ వాదులు అందులోనూ కేంద్ర పాలక పక్ష ప్రతినిధులు మాట్లాడ్డం ఎక్కువ ప్రచారం ఇస్తున్నది. నటి ఛార్మి వేసిన కేసులో కోర్టు ఎలాగూ ఆదేశాలు ఇస్తుంది గనక ఆ ప్రకారం చేయొచ్చు. కాని ఇంతలోనే రభస చేయడం చూస్తుంటే మాఫియా శక్తులు మాట్లాడిస్తున్నట్టు భావించాల్సి వస్తున్నది.