నంద్యాల ఉప ఎన్నిక తేదీల ప్రకటన వెలువడితే ప్రభుత్వ వరాల ప్రకటన కుదరదు గనక సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే హుటాహుటిన వెళ్లి పార్టీవారిపైన ప్రజలపైన వరాలు, ప్రతిపక్షాలపైన శరాలు కురిపించి వచ్చారు. ఆయనతో పాటు మంత్రివర్గ సీనియర్లు కార్పొరేషన్ల చైర్మన్లు తదితర చతురంగ బలమంతా తరలి వెళ్లింది . ఈ సందర్భంగా నంద్యాల ప్రభుత్వ అతిధి గృహంలో జరిగిన టిడిపి సమావేశంలో మనం యాభై వేల ఓట్ల ఆధిక్యతతో గెలవాలని ముఖ్యమంత్రి లక్ష్యం నిర్ణయించారట. గత ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి వైసీపీ తరపున 82 వేలకు పైగా ఓట్లు తెచ్చుకోగా టిడిపి తరపున శిల్పా మోహనరెడ్డి దాదాపు 78.5 వేల ఓట్లు పొందారు. అంటే తేడా మూడువేలకు పై చిలుకు మాత్రమే.
మరి అప్పుడు ఓడిపోయిన పార్టీ తరపున పోటీ చేస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డి యాభైవేల ఆధిక్యత తెచ్చుకోవాలంటే వైసీపీ పక్షాన నిలబడుతున్న శిల్పాకు యాభైవేల ఓట్లు రావాలి. ఆ మేరకు టిడిపి అంగీకరిస్తున్నదన్నమాట. కాని వారి ప్రచారార్భాటాలు ప్రతిజ్ఞలు చూస్తుంటే మొత్తం తుడిచిపెట్టేస్తామంటున్నారే? ఈ లోగా కాంగ్రెస్ కూడా అభ్యర్థిని ప్రకటించనున్నట్టు పేర్కొంది. రాయలసీమ పరిరక్షణ సమితి బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఎలాగూ వున్నారు. ఉప ఎన్నికల తేదీని కూడా వెంటనే ప్రకటించబోతున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్లాల్ కర్నూలు కలెక్టరేట్లో అధికారిక సమావేశం తర్వాత ప్రకటించారు. ఒక్కసారి ఆ తతంగం పూర్తయితే ఇక వాగ్దానాలు అధికారిక పర్యటనలు కట్టిపెట్టాల్సిందే. తేదీ తెలిసిన తర్వాత జగన్ సందర్శిస్తారేమో.. కాబట్టి నంద్యాల సమరం రసవత్తరంగానే వుండటం తథ్యం.