కిరణ్ కుమార్ రెడ్డి… నామ్ తో సునా హోగా! అదేనండీ.. అవిభక్త ఆంధ్రప్రదేశ్ కు ఆఖరి ముఖ్యమంత్రి. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై తిరుగుబావుటా ఎగరేసిన నేత. విభజనను అడ్డుకునేందుకు చివరి బంతి వరకూ పోరాటం చేసిన నాయకుడు. 2014 ఎన్నికల్లో ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి ఏ రేంజి షాకు తగిలిందో… అంతకంటే ఎక్కువ షాక్ కిరణ్ కుమార్ రెడ్డి పొలిటికల్ కెరీర్ కీ తగిలిందనడంలో సందేహం లేదు. సొంత నియోజక వర్గంలో తమ్ముడిని కూడా గెలిపించుకోలేకపోయారు. అప్పట్నుంచీ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఈ మధ్యనే ఆయన పొలిటికల్ కెరీర్ ను పునః ప్రారంభించే పనిలో ఉన్నారని కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో చేరతానంటూ కొన్ని కథనాలు వినిపించాయి. లేదు లేదు.. ఆయన వైకాపాలో చేరడం ఖాయమే అనే కథనాలు మీడియాలో దర్శనమిచ్చాయి. అయితే, అవన్నీ ఊహాగానాలుగా మాత్రమే మిగిలిపోయాయి. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న కొత్త టాపిక్ ఏంటంటే… కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీలోనే చేరబోతున్నట్టు..!
రాజకీయ భవిష్యత్తును వెతుక్కునే క్రమంలో ఆయన మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు… పార్టీ చేరికకు సంబంధించి ఢిల్లీ స్థాయిలో కదలిక వచ్చినట్టు కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లి వచ్చారని సమాచారం. పార్టీలో చేరిక అంశమై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతోపాటు పలువురు పార్టీ పెద్దలతో చర్చించారట. ఉప రాష్ట్రపతి ఎన్నికలు ముగిసిన వెంటనే కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ చేరేందుకు ముహూర్తం ఖరారు అవుతుందనీ ఇప్పుడు వినిపిస్తోంది. ఏఐసీసీలో ప్రధాన కార్యదర్శి పదవి ఆయనకు దక్కే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ పర్యటన వివరాలను కిరణ్ రహస్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారట!
అయితే, ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీ కూడా కిరణ్ కుమార్ రెడ్డిపై ఎందుకు మొగ్గు చూపుతోందంటే… ఏపీలో పునర్వైభవం కోసమే అని తెలుస్తోంది. 2014 ఎన్నికల తరువాత తలో దిక్కు వెళ్లిన కాంగ్రెస్ నేతల్ని మళ్లీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు అధిష్టానం ప్రయత్నిస్తోంది. దీన్లో భాగంగానే గతంలో పార్టీ వీడిన నేతలు తిరిగి వస్తే… పార్టీలో మంచి గుర్తింపు ఉంటుందని చెప్పడం కోసమే కిరణ్ కుమార్ రెడ్డికి పదవి ఇచ్చి మరీ చేర్చుకోబోతున్నట్టు చెబుతున్నారు. విభజన సమయంలో ముఖ్యమంత్రిగా కిరణ్ ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ.. వ్యక్తిగతంగా ఆయన తెలివైన వారు, విద్యావంతులు అనే ఇమేజ్ ఉంది. ఏపీలో ప్రస్తుతం రఘువీరా రెడ్డి ఒక్కరే పార్టీ బాధ్యతలను ఈసురోమంటూ ఈడ్చుకుంటూ వస్తున్నారు. ఆయనకు కిరణ్ కూడా తోడైతే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందనేది అధిష్టానం వ్యూహంగా చెబుతున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక అయిపోయిన వెంటనే కిరణ్ రాజకీయ భవిష్యత్తుపై ఏదో ఒక ప్రకటన ఉంటుందనే ప్రస్తుతానికి తెలుస్తోంది. ఏదేమైనా, ఇప్పట్నుంచీ ఏపీలో కాంగ్రెస్ పునర్నిర్మాణం మొదలుపెడితే… పునర్వైభవం 2024 నాటికి సాధ్యం కావొచ్చు..!