హైదరాబాద్: తెలుగు, తమిళంలోనే కాకుండా జాతీయ స్థాయిలో ఎన్నో రికార్డ్‌లు నెలకొల్పిన ‘బాహుబలి’, శాటిలైట్ రైట్స్ రేటులోనూ రికార్డ్ సృష్టించింది. సాధారణంగా భారీ చిత్రాల శాటిలైట్ రైట్స్ విడుదలకు ముందే అమ్ముడవుతుంటాయి. కానీ బాహుబలికి మాత్రం రెండునెలల తర్వాత అమ్ముడు పోవటం విశేషం. మంచి రేటుకోసం నిర్మాతలు ఆగటమే దీనికి కారణంగా చెబుతున్నారు.
విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం బాహుబలి శాటిలైట్ రైట్స్ రు.29 కోట్లకు అమ్ముడు పోయినట్లు ఒక ఆంగ్ల దినపత్రిక ఇవాళ ఒక కథనాన్ని వెలువరించింది. అయితే ఈ రేటు రెండు భాగాలకూ కలిపి అని పేర్కొన్నారు. విడుదలైన మొదటి భాగాన్ని రు.18 -20 కోట్ల మధ్యలో అమ్ముదామని నిర్మాతలు భావించారట. సాధారణంగా తెలుగులో పెద్ద చిత్రాలకు రు.9 – 12 కోట్ల వరకు రేటు పలుకుతుంది. దీంతో బాహుబలి మొదటి భాగానికి నిర్మాతలు చెప్పిన రేటుకు పెద్దగా స్పందన రాలేదు. ఈ కారణంగా నిర్మాతలు రెండు భాగాల శాటిలైట్ రైట్స్‌నూ హోల్‌సేల్‍గా అమ్మేశారని కథనం. రెండోభాగం చిత్రీకరణ ఈ నెలలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. 40శాతం షూటింగ్ గతంలోనే పూర్తయింది. అతిత్వరగా – నాలుగు నెలల్లో చిత్రీకరణను పూర్తిచేసి 2016 జులైలో విడుదల చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.