రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన ప్రణబ్ ముఖర్జీ తనకు ఎంతగానో మార్గ నిర్దేశం చేశారని ప్రధాని మోడీ పలుసార్లు చెప్పారు. కాని ఆయన అధికార హౌదాలో చేసిన ఆఖరి ప్రసంగం మాత్రం అంతుతెలియని సెన్సారింగ్‌కు గురైంది. (తనను ఈ పదవిలో కూచోబెట్టిన) కాంగ్రెస్ అద్యక్షురాలు సోనియా గాంధీ గురించి చేసిన సానుకూల ప్రస్తావన కాస్త ఆయన ప్రసంగ పాఠం ముద్రిత ప్రతిలో ఎగిరిపోయింది! దీనిపై పార్లమెంటు ఎంపిలు చర్చించుకున్నారట. ఆదివారం నాడు పార్లమెంటు సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి ప్రణబ్‌కు వీడ్కోలు చెప్పారు. ఈ సమయంలో ఆయన ఆఖరి ప్రసంగం చేశారు. ఆయనేమన్నారంటే-” పి.వి.నరసింహారవు ప్రజ్ఞాపాటవం, అటల్ బిహారీ వాజపేయి వక్త్రత్వం, మధులిమాయే, డా.నాథ్పారుల మధుర వాక్యాలు, పిలూమోడీ హాస్యచతురత, హీరేన్ ముఖర్జీ కవితా ప్రసంగాలు, ఇంద్రజిత్‌గుప్తా సమయస్పూర్తి, డా.మన్మోహన్ సింగ్ బలీయమైన ఉనికి, ఎల్‌కె అద్వానీ పరిపక్వ సలహాలు , సామాజిక శాసనాలపై సోనియా గాంధీ బలమైన మద్దతు వంటి కారణాల వల్ల పార్లమెంటులో నేనున్న కాలం సుసంపన్నమైంది.. ” ఇది ఆయన ప్రసంగంలో చెప్పింది. రాష్ట్రపతి భవన్ అధికార వెబ్సైట్లోనూ వున్నది. కాని పార్లమెంటులో ఆయన మాట్లాడ్డానికి ముందు అందజేసిన ఉపన్యాస ప్రతులలో మాత్రం సోనియా గాంధీ ప్రస్తావన కనిపించడం లేదు. ఇదెలా ఎందుకు జరిగిందన్నది ప్రశ్న. ప్రణబ్ ప్రసంగంలో రాజీవ్ గాంధీ ప్రస్తావన లేకుండా పోవడం కూడా అందరినీ ఆకర్షించింది. వారిద్దరికీ సత్సంబంధాలు లేవన్నది తెలిసిన విషయమే.