ఈమధ్య కథానాయికలు బోల్డ్ పాత్రల్లో నటించడానికి తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. ఎందుకంటే… కాస్త ధైర్యం చేసి నటిస్తే… బోల్డంత పేరు తీసుకొచ్చేవి ఆ టైపు పాత్రలే! బాలీవుడ్ తెరపై కథానాయికలు మందు కొట్టడం, దమ్ములాగడం కామనే గానీ, తెలుగు తెరపై ఇంకా ఆ వాతావరణం ఉధృతం కాలేదు. అయితే.. కేథరిన్ మాత్రం ఓ సినిమాలో దమ్ము కొట్టేసింది. సిగరెట్ పొగలు వదులుతూకనిపించింది. ఆ సినిమానే ‘నేనే రాజు నేనే మంత్రి’. తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్‌తో పాటు, కేథరిన్ కూడా ఓ కథానాయికగా కనిపించనుంది. ఇందులో కేథరిన్ది కాస్త నెగిటివ్ లక్షణాలున్న పాత్ర. ఆ పాత్ర బాగా పండడానికి ఓ సన్నివేశంలో దమ్ములాగాల్సివచ్చిందట. తేజ చెప్పడం.. కేథరిన్ ఆచరించడం జరిగిపోయాయి. తాను పొగ త్రాగడాన్ని సమర్థించుకొంది కేథరిన్.
”సన్నివేశం అలాంటిది. అందుకే సిగరెట్కాల్చాను. అయితే నిజ జీవితంలో మాత్రం సిగరెట్ తాగింది లేదు. అమ్మాయిలు సిగరెట్లు కాల్చితే నచ్చదు. తెరపై కాబట్టి పాత్ర పరిధి మేరకు నటించడంలో తప్పు లేదు” అని చెబుతోంది. ఈ వారం విడుదల కాబోతున్న ‘గౌతమ్ నంద’లోనూ కేథరిన్ కథానాయికగా నటిస్తోంది. ‘జయ జానకి నాయక’లో ప్రత్యేక గీతం చేసింది కేథరిన్. ఈ మూడు సినిమాలూ 15 రోజుల వ్యవధిలో రాబోతున్నాయి. సో.. ఈ పక్షం రోజులూ కేథరిన్ కెరీర్‌కి చాలా కీలకం. ఒక్క హిట్టు దక్కినా చాలు.. మరో నాలుగు సినిమాల్ని సంపాదించుకోగలదు. ఏం జరుగుతుందో చూడాలి.