హైదరాబాద్: తాటిపూడి ప్రాజెక్ట్నుంచి పోలవరం కుడికాల్వకు నీళ్ళు పంపి పట్టిసీమనుంచి కృష్ణలోకి నీళ్ళు పంపినట్లు జనాన్ని ఎందుకు మభ్యపెడుతున్నారని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్ట్ పదిశాతంకూడా పూర్తికాకుండానే జాతికి అంకితమివ్వటమేమిటని అన్నారు. అదికూడా తాత్కాలిక ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేస్తారా అని ప్రశ్నించారు. శాశ్వతంగా ఉండే ప్రాజెక్టును మాత్రమే జాతికి అంకితం చేస్తారని చెప్పారు. ఉండవల్లి ఇవాళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఏదైనా ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపణలు రావటం సహజమేగానీ, కేవలం ముడుపుల కోసమే చేపట్టిన ప్రాజెక్ట్ దేశంలో పట్టిసీమ ఒక్కటేనని అన్నారు. పట్టిసీమకు, రాయలసీమకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. పోలవరం కుడికాల్వకింద భూమిని నష్టపోయిన రైతులకు ఎకరాకు నలభై లక్షలవరకు ఇవ్వటం బాగానే ఉందని, తాటిపూడి, పోలవరం ప్రాజెక్టులకింద రైతులకుకూడా అలాగే ఇవ్వాలని సూచించారు. రాయలసీమకు పప్పన్నం పెడుతుంటే విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని చంద్రబాబు అంటున్నారని, అయితే సీమకు పప్పన్నంకాదు గన్నేరపప్పు పెడుతున్నారని విమర్శించారు. గోదావరి జలాలను విశాఖకుకూడా తీసుకొస్తానని చంద్రబాబు చెప్పటం విడ్డూరంగా ఉందని అన్నారు. అమరావతి అనేది చంద్రబాబు తన సొంత మనుషులకోసం 30వేల ఎకరాలలో కట్టుకుంటున్న ప్రాకారమని ఉండవల్లి వ్యాఖ్యానించారు. పట్టిసీమ వధ్యశిలగా మారుతుందని చంద్రబాబునాయుడును హెచ్చరించారు.