తెలుగు360.కామ్ రేటింగ్ 2.5/5
కథల విషయంలో దర్శకుల ఆలోచనా విధానం మారుతోందేమో అనిపిస్తోంది. కొత్త కథల గురించి ఆలోచించడం కంటే, పాత కథనే.. కాస్త పాలీష్ చేసుకొని, రెండు మూడు ట్విస్టులు రాసుకొని – కొత్త ప్యాకేజీతో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక విధంగా ఇవి మంచి ఫలితాలనే ఇస్తున్నాయి. సంపత్ నంది కూడా ఆ విధంగానే ఆలోచించాడు… ‘గౌతమ్ నంద’ కోసం. ‘రాముడు భీముడు’ తరహా పాయింట్ పట్టుకొని – దానికి తన స్టైల్లో మార్చుకొని – దానికి ఓ భయంకరమైన ట్విస్టు జోడించాడు. మరి ఈ తూకం సరిపోయిందా?? ట్విస్టుకి తగిన న్యాయం జరిగిందా? గౌతమ్ నందలో మెచ్చునే అంశాలేంటి? నొచ్చుకొనే పాయింట్లేంటి?
* కథ
అతని పేరు గౌతమ్ (గోపీచంద్). తన దగ్గర ఎంత డబ్బుందో లెక్కేలేదు. డబ్బుని నీళ్లలా ఖర్చు పెట్టేస్తాడు. డబ్బు తప్ప మరో ఎమోషన్ తెలీదు. ఒకానొక సందర్భంలో జ్ఞానోదయం అవుతుంది. నాన్న పేరు చెప్పుకొని బతకడం కాదని, తనని తాను తెలుసుకోవాలనే ప్రయత్నం మొదలెడతాడు. ఆ సమయంలోనే నందు (గోపీచంద్) కలుస్తాడు. ఇద్దరూ ఒకే పోలికతో ఉంటారు. కాకపోతే నేపథ్యాలు వేరు. గౌతమ్ ధనవంతుడైతే.. నందు బీదవాడు. అందుకే ఓ ఒప్పందం మేరకు ఒకరి స్థానంలోకి మరొకరు వెళ్తారు. డబ్బు కంటే జీవితం, మనుషులు విలువైన వాళ్లని గౌతమ్ – అన్నింటికంటే డబ్బే గొప్పదనుకొనే నందు చివరికి ఏం తెలుసుకొన్నారన్నదే `గౌతమ్ నంద` కథ.
* విశ్లేషణ
కథని చూచాయిగా చెప్పుకొంటూ వెళ్తే.. చాలా పాత సినిమాలు గుర్తొస్తాయి. ఒకరి స్థానంలోకి మరొకరు వెళ్లడం, ఒకరి ఐడెంటినీ మరొకరు తీసుకోవడం సెవన్టీస్లో చూసేసినవే. అయితే.. సంపత్ తెలివిగా ఆ పాత పాయింట్‌కి ఓ బలమైన ట్విస్ట్ జోడించి ఆశ్చర్యపరుస్తాడు. గౌతమ్ లైఫ్… స్టైల్.. తనలో మార్పు – నందు పాత్ర, పాత్రల ప్లేస్ మెంట్ ఇవన్నీ వర్కవుట్ అవ్వడంతో ఫస్టాఫ్ ఏ లోటూ లేకుండా సాగిపోతుంది. గౌతమ్ లైఫ్ స్టైల్‌ని దర్శకుడు పోట్రైట్ చేసిన విధానం నచ్చుతుంది. ఇంట్రవెల్ వరకూ ఎలాంటి ఒడిదుడుకులూ లేవు. మాస్‌కి నచ్చే అంశాల్ని పేర్చుకొంటూ వెళ్లడంలో దర్శకుడు సక్సెస్ అవ్వడంతో సినిమా పాస్ అయిపోతుంది. ద్వితీయార్థంలోనే కాస్త తడబడ్డాడు. ఇంట్రవెల్ దగ్గర్నుంచి ప్రీ క్లైమాక్స్ వరకూ… రొటీన్ సన్నివేశాలతో విసిగించాడు. నమ్ముకొన్న సెంటిమెంట్ సీన్లు వర్కవుట్ కాకపోవడం, కామెడీ మిస్ అవ్వడంతో ద్వితీయార్థం భారంగా నడుస్తుంది. పాయింట్ పాతదైనప్పుడు అందులో కొత్త సన్నివేశాల్ని మేళవించుకోవడానికి ట్రై చేయాలి. కానీ.. దర్శకుడు మాత్రం ఆ ప్రయత్నం చేయలేదు. ప్రీ క్లైమాక్స్ లో వచ్చిన ట్విస్ట్ ని దర్శకుడు ఎంత నమ్ముకొన్నాడంటే.. పూర్తిగా దానిపైనే ఆధారపడిపోయాడు. నిజంగానే ట్విస్ట్… షాక్ ఇచ్చేలానే ఉంది. `అరె… ఇంత మంచి పాయింట్‌ని సరిగా డీల్ చేయలేదా?` అనే అనుమానం వస్తే అది ప్రేక్షకుడి తప్పు కాదు. ట్విస్ట్‌ని ఒక్కసారిగా రివీల్ చేయడంతో ఆ కిక్ కాస్త తగ్గుతుంది. అయినా… క్లైమాక్స్ వరకూ బండి జోరుగా సాగిపోవడానికి అది సహాయపడింది.
* నటీనటుల ప్రతిభ
గోపీచంద్‌ని నిజంగానే ఇదో కొత్త ప్రయత్నం. రెండు పాత్రల్లోనూ వైవిధ్యం చూపించాడు. గౌతమ్ పాత్రలో చాలా స్టైలీష్‌గా కనిపించాడు గోపీచంద్. బహుశా.. అతని బెస్ట్ లుక్ ఇదే కావొచ్చు. ఈ కథని ఒప్పుకోవడానికి కారణం… తన పాత్రలో ఉన్న డిఫరెంట్ షేడ్స్. ఆ మేరకు గోపీచంద్ న్యాయం చేశాడనే చెప్పాలి. హీరోయిన్ల పాత్రకు అంత ప్రాధాన్యం లేదు. టైమ్ స్పేస్ కూడా తక్కువ. పాటల్లో మాత్రం హీరోయిన్లని బాగా వాడుకొన్నాడు దర్శకుడు. విలన్లున్నా.. వాళ్లని వాడుకోవడంలో, కమెడియన్లు ఉన్నా వాళ్ల నుంచి కామెడీ పిండుకోవడంలో దర్శకుడు విఫలమయ్యాడు.
* సాంకేతిక వర్గం
ఏ సినిమాకైనా దర్శకుడే కెప్టెన్. అక్కడి నుంచి మొదలెడితే.. క్లైమాక్స్ ట్విస్ట్ తప్పితే కథ పాతదే. అయితే.. అనుకొన్న కథని స్టైలీష్ గా తీర్చిదిద్దగలిగాడు. అక్కడక్కడ డబ్బుకి సంబంధించిన సంభాషణలు బాగున్నాయి. ఈ పాయింట్‌ని మరోలా డీల్ చేసి ఉంటే… కచ్చితంగా గౌతమ్ నంద నిలబడిపోయే సినిమా అవుదును. పాటలు మాస్ కి నచ్చుతాయి. వాటిని చిత్రీకరించిన విధానమూ బాగుంది. ఆర్.ఆర్‌లో తమన్ మార్క్ కనిపిస్తుంది.
* ఫైనల్ టచ్ : స్టైల్ ఉన్న సినిమా ఇది. దాంతో పాటు ట్విస్టు కూడా బాగుంది. వీటిమధ్య కథలో కాస్త కొత్తదనం చూపించినా బాగుండేది.
తెలుగు360.కామ్ రేటింగ్ 2.5/5