ఏదో ఒక ఇష్యూ వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని విపక్షాలు విమర్శించడం అనేది రొటీన్ గా జరిగేదే. ఇక, డ్రగ్స్ కేసు నేపథ్యంలో ప్రభుత్వ పనితీరుపై విపక్షాలు తీవ్ర స్వరంలో విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇతర నేతలంతా ఒకెత్తు… తెలుగుదేశం వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసే విమర్శలు మరొక ఎత్తు! ఇష్యూ ఏదైనా సరే, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసుకోవడం రేవంత్ కి అలవాటు. నిజానికి, తన వాదనకు సరిపడా ఆధారాలను ఆయన సేకరించి, కొంత హోం వర్క్ చేసి మరీ మాట్లాడుతున్నా… పట్టించుకునే నాథుడే కరువయ్యాడని చెప్పొచ్చు. మియాపూర్ కుంభకోణం నేపథ్యంలో కేసీఆర్ కుటుంబానికి ఉన్న లింకులను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. కానీ, ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. రేవంత్ బయటపెట్టిన వివరాలకు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పుడు డ్రగ్స్ కేసు విషయంలో కొన్ని కీలక అంశాలను రేవంత్ బయపెట్టారు.
డ్రగ్స్ కేసు విషయంలో విచారణ సంస్థలు అనుసరిస్తున్న తీరు నిరాశ కలిగించేలా ఉందన్నారు. ఈ మహమ్మారి రాష్ట్రంలోని అన్ని వర్గాలనూ పీడిస్తుంటే.. కేసీఆర్ సర్కారు మాత్రం కొన్ని వర్గాలనే టార్గెట్ చేసుకుని చర్యలకు దిగుతుండటం విచారకరం అన్నారు. గడచిన అరవయ్యేళ్లలో 56 పబ్ లకు అనుమతులు ఇస్తే… కేసీఆర్ ప్రభుత్వం గడచిన మూడేళ్లలో 57 పబ్ లకు పర్మిషన్లు ఇచ్చిందన్నారు. జూబ్లీహిల్స్, మాదాపూర్, బంజారాహిల్స్ ప్రాంతాలను పబ్, డ్రగ్స్ కు అడ్డాలుగా మార్చేశారన్నారు. హైదరాబాద్ లో మ్యూజికల్ నైట్స్ పెరుగుతున్నాయన్నారు. పర్యాటక శాఖ నిధుల్ని మ్యూజికల్ నైట్స్ వంటి కార్యక్రమాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ బావ మరిది ఈవెంట్స్ నౌ పేరుతో ఇలాంటి దందాలు చేస్తున్నారన్నారు. ఆయనపేరు రాజేంద్ర పాకాల అనీ, రాజ్ పాకాల పేరుతో పాపులర్ అయ్యారన్నారు. రాజేంద్ర పాకాల భార్య కూడా ఇదే వ్యాపారంలో ఉన్నారనీ, డీజే నైట్స్ వంటి ఈవెంట్స్ చేస్తుంటారని రేవంత్ రెడ్డి చెప్పారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులే మాదక ద్రవ్యాల వ్యాపారంలో ఉండటం చూస్తుంటే సమాజం ఎటుపోతోందో అనే ఆందోళన కలుగుతోందని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కుమారుడు, ఆయన బావ మరిది చేస్తున్న వ్యాపారాలపై నిఘా సంస్థలు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ ప్రతీరోజూ సాయంత్రం ఎటు వెళ్తుంటారో చెప్పాలన్నారు. కేటీఆర్ కు ఉన్న బలహీనత.. దాన్ని ఆసరాగా చేసుకుని వాడుకుంటున్న రాజులు ఎవరో బయటకి తెలియాలని డిమాండ్ చేశారు.
డ్రగ్స్ కేసు విషయంలో విపక్షాల నాయకుల కంటే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాస్త తీవ్రమైనవే. ముఖ్యమంత్రి కుటుంబంతో డ్రగ్స్ కేసుకు సంబంధాలు ఉన్నాయని నిరూపించే ప్రయత్నం చేస్తూ ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలపై ప్రభుత్వం తరఫున ఎవరు స్పందిస్తారో చూడాలి. నిజానికి, రేవంత్ వ్యాఖ్యల్ని పట్టించుకోనట్టుగానే ఉండటం తెరాస సర్కారుకు అలవాటు. ఇప్పుడు కూడా అదే ధోరణిలో వ్యవహరిస్తుందేమో! మియాపూర్ భూదందా విషయంలో మాదిరిగా, ఇప్పుడు రేవంత్ చేసిన వ్యాఖ్యలు కూడా అరణ్య రోదనగా మిగిలిపోతాయేమో..!