ఉద్దానం.. దశాబ్దాలుగా మూత్రపిండ వ్యాధులకు ఆలవాలంగా నిలిచి.. ప్రభుత్వాల కళ్ళు మూతపడకుండా చేసిన ప్రాంతం. ఏ సమస్యకైనా రాజకీయమే పరిష్కారమని నిరూపించిన ప్రదేశం. దాదాపుగా 60 ఏళ్ళ కాంగ్రెస్ ఏలుబడిలో బాధితులు మృత్యువాత పడుతున్నా.. పరిశోధనలతో కాలం వెళ్లబుచ్చిన వ్యాధిగ్రస్థ చకోరం. ఇప్పుడు ఆ ప్రాంతానికి కాస్త స్వాంతన చేకూరింది. అదీ జనసేనాధిపతి పవన్ కల్యాణ్ చొరవతో. అంటే ఆయనే ఈ సమస్యను గుర్తించారని కాదు. తీవ్రతను ఎత్తిచూపారు. ప్రభుత్వానికి వణుకుపుట్టించారు. స్పందించక తప్పని పరిస్థితి కల్పించారు. ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికీ ఆయన ఊపిరాడని స్థితిని తెచ్చారు. తాను కూడా ఉద్దానంపైనే దృష్టిని కేంద్రీకరిస్తే పవన్ కల్యాణ్‌కే ఆ క్రెడిట్ వెళ్ళిపోతుందని భావించిన ఆయన ప్రకాశం జిల్లాలోని గ్రానైట్ తవ్వకాల ప్రాంతాలను ఎంచుకున్నారు. అక్కడ కూడా కిడ్నీ వ్యాధి పీడితులు ఎక్కువే. కానీ ప్రభుత్వం అటు చూసింది లేదు. అదే రాజకీయం. పవన్ పోరాటానికి స్పందించినట్లు `కనిపిస్తే` తనకు వచ్చే ఎన్నికల్లో ఉపయోగపడతాడని ఆశ. ఎవరి ఆశ ఏదైనా ఉద్దానంలో మూత్రపిండాల వ్యాధిగ్రస్థులకు కాస్త వైద్య సహాయం అందుతోంది. సురక్షిత జలం సరఫరా అవుతోంది. డయాలసిస్ చేయించుకుంటున్న వారికి నెలకు 2500 చొప్పున పింఛను ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. తాజాగా హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి వైద్యుల బృందం ఈ ప్రాంతంపై పరిశోధనకు విచ్చేసింది. గతంలో ఆ విశ్వవిద్యాలయంలో లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ఉద్దానం అంశంపై చర్చించి, బృందం ఇక్కడికొచ్చేందుకు కృషి చేశారు. ఇది కచ్చితంగా పవన్ కల్యాణ్ విజయమే. ప్రశ్నించడానికే తమ పార్టీ పుట్టిందని పవన్ కల్యాణ్ చెబుతుంటారు. అలాగే.. తన పోరాటాలు ఇస్యూ బేస్డ్గా ఉంటాయి తప్ప రాజకీయ ప్రయోజనాలకు కాదని కూడా ఆయన చెప్పారు. తన మాటకు పవన్ కట్టుబడి ఉన్నారని చెప్పడానికి ఇంతకంటే రుజువులు కావాలా! పీకే ఇలాగే తన పోరాటాన్ని కొనసాగిస్తే చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుందనడంలో సందేహం లేదు.
కానీ ఇక్కడో చిక్కుంది. పవన్ చూపిస్తున్న సమస్యలకు చంద్రబాబు సర్కారు పరిష్కారాన్ని కనుగొంటోంది కాబట్టి.. దీని ఫలితం టీడీపీకే దక్కుతుంది. కాకపోతే.. దక్కించుకునేందుకు బాబు ఎత్తులు వేస్తారు. ఖర్చు చేస్తూ ఫలితం పక్కవాడికి పోవడానికి ఎవ్వరూ అంగీకరించరు. చంద్రబాబు అంతకంటే ఒప్పుకోరు. ఆయన అంతిమ లక్ష్యం 2019లో అధికారంలోకి తిరిగిరావడం. అందుకోసం ఆయన ఏమైనా చేస్తారు. ఉద్దానం సమస్యం ఒక కొలిక్కి వచ్చాక, ఆ ప్రయోజనాన్ని తమ పార్టీలో జమయ్యేలా చేసుకోవడానికి కచ్చితంగా పావులు కదుపుతారు. ఎందుకంటే ఆయన రాజనీతిజ్ఞుడు. మనకి అధికారం అవసరం లేదు.. సమస్యలు తీరితే చాలనుకుంటే.. జనసేనాధిపతి అధికారానికి వారధి కాగలరు తప్ప అధికార పీఠంపై ఎప్పటికీ కూర్చోలేరు. అంటే కింగ్ మేకర్‌గానే మిగులుతారన్న మాట. ఇప్పటికైనా ఆయన కాస్త తెలివిడి తెచ్చుకోవడం మేలు.
-సుమ