ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెంచుతున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలో భాజపా ఎదుగుదలను అడ్డుకుంటున్నది కేంద్రమంత్రి వెంకయ్య నాయుడే అని ఏపీ భాజపా నేతలు ఆరోపించేవారు. సీఎం చంద్రబాబును ప్రతీ విషయంలోనూ వెనకేసుకు వస్తూ, భాజపా ఇమేజ్ పెరగనీయకుండా చేస్తున్నారంటూ అధినాయకత్వానికి ఫిర్యాదులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, వెంకయ్య ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థి కావడంలో ఇకపై ఆయన క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోవడం ఖాయం. ఎలాగూ ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉంది కాబట్టి, ఇప్పట్నుంచే రాష్ట్ర రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని భాజపా అధినాయకత్వం భావిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవిని పురందేశ్వకి ఇవ్వబోతున్నారని సమాచారం.
పార్టీ అధ్యక్ష బాధ్యతలు పురందేశ్వరికి ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో చంద్రబాబుకు చెక్ పెట్టాలన్నది భాజపా ఆలోచనగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి కావడంతో.. ఆ రకమైన ఇమేజ్ కొంతమేరకు ఉపయోగపడే అవకాశం ఉందని భావిస్తున్నారట. పార్టీ బాధ్యతలు ఆమెకి అప్పగించడం ద్వారా ఏపీలో భాజపాకి కొంత ఊపు తీసుకుని రావొచ్చనేది పార్టీ వ్యూహంగా చెప్పొచ్చు. అయితే, ఏపీలో ఇప్పటికే భాజపాపై కొంత వ్యతిరేకత ఉందనేది వాస్తవం. ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ మొండి చేయి చూపించారు. రాష్ట్ర ప్రయోజనాలు, కేంద్ర కేటాయింపుల విషయంలో కూడా ఏపీ సర్కారు కేంద్రంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతీ తెలిసిందే. అన్నిటికీమించి.. నియోజక వర్గాల సంఖ్య పెంపు విషయంలో భాజపా సర్కారు కొత్త పితలకాటకమే పెడుతోంది. అన్నీ అయిపోయాక.. రాజకీయ నిర్ణయం జరగాలంటూ మెలిక పెడుతోంది.
ఈ నేపథ్యంలో భాజపాపై అధికార పార్టీ టీడీపీ గుర్రుగానే ఉంది. ప్రత్యేక హోదా, రైల్వేజోన్ వంటి హామీలను నెరవేర్చకపోవడంపై రాష్ట్ర ప్రజల్లో కూడా భాజపాపై కొంత అసంతృప్తి వ్యక్తమౌతూ ఉంది. ఈ నేపథ్యంలో పురందేశ్వరిని రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిని చేసినంత మాత్రాన.. అది రాజకీయంగా ఏ మేరకు పనికి వస్తుందనేది ప్రశ్న..? కేవలం ఎన్టీఆర్ కుమార్తె అనే ప్రాతిపదిక పదవి ఇవ్వడం ఏ మేరకు భాజపాకి ప్లస్ అవుతుందనేది కూడా చర్చనీయాంశమే. అయితే, పార్టీ బాధ్యతలు చేపట్టిన తరువాత కనీసం రైల్వే జోన్ విషయంలోనైనా పురందేశ్వరి నేతృత్వంలో ఒక నిర్ణయం తీసుకుంటే… చంద్రబాబుకు పకడ్బందీ చెక్ చెప్పేందుకు ఈ నిర్ణయం ద్వారా కొంతైనా ఆస్కారం ఉంటుంది.