బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీని ఎదుర్కొనేందుకే 6 పార్టీలు కలిసి జనతా పరివార్ కూటమిని ఏర్పాటు చేసుకొని దానికి సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ ని అధ్యక్షుడుగా ఎన్నుకొన్నాయి. కానీ ఆయనకి తెలియకుండా, ఆయన పార్టీకి సీట్లు కేటాయించకుండా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్.జె.డి. అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్ని సీట్లు పంచేసుకోవడంతో ములాయం సింగ్ అలిగి జనతా పరివార్ కూటమి నుండి తప్పుకొని ఒంటరిగా బరిలోకి దిగుతున్నారు.
ఆయనని వెనక్కి రప్పించే ప్రయత్నాలు ఫలించకపోవడంతో, జనతా పరివార్ కూటమిని విచ్చినం చేయడానికే బీజేపీ ఆయనని వెనక నుండి ఎగద్రోసిందని ఆరోపించడం మొదలుపెట్టారు. కానీ ములాయం సింగ్ బయటకు వెళ్ళేలా చేసింది వారేనని వారికీ తెలుసు. బీజేపీ, సమాజ్ వాదీ పార్టీల మధ్య రహస్య అవగాహన కుదిరందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఆ ఆరోపణలను దృవీకరిస్తున్నట్లుగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ రిషికేశ్ లో పాల్గొన్న ఒక బహిరంగ సభలో ములాయం సింగ్ ని పొగడ్తలతో ముంచెత్తి ఆయనని ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం చేసారు.
దేశాభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన 40మంది ఎంపీలు అడుగడుగునా అడ్డు తగులుతున్నారని, అటువంటి సమయంలో ములాయం సింగ్ తమ ప్రభుత్వానికి అండగా నిలబడి ఎంతో సహకరిస్తున్నారని మెచ్చుకొన్నారు. ఈ సభలో ములాయం సింగ్ ని ప్రసన్నం చేసుకొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గట్టిగానే ప్రయత్నించారని చెప్పవచ్చును.
ఒకవేళ ములాయం సింగ్ ఎన్డీయే కూటమిల జేరినా లేదా బీజేపీతో పొత్తులు పెట్టుకొన్నా బీహార్ ఎన్నికలలో పార్టీల బలాబలాలను ఒక్కసారిగా మార్చివేసే అవకాశం ఉంది. ములాయం సింగ్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆయన పార్టీకి బీహార్ లో కూడా మంచి బలం ఉంది. ఒకవేళ ఆయన బీజేపీతో చేతులు కలిపినట్లయితే యాదవుల ఓట్లు చీలిపోవడం తధ్యం. దాని వలన జనతా పరివార్ విజయావకాశాలు సన్నగిల్లవచ్చును. కానీ ప్రధాని నరేంద్ర మోడీ ములాయం సింగ్ ని బీజేపీ వైపు ఆకర్షించగలరో లేరో ఇంకా తేలవలసి ఉంది. దానిని బట్టే బీహార్ రాజకీయ సమీకరణాలు, బలాబలాలు మారవచ్చును.