మరోసారి ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య వార్తలోకి వచ్చింది. దానికి కారణం జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఎప్పట్నుంచో సమస్యగా మిగిలిపోతున్న ఉద్దానం కిడ్నీ బాధితుల ఆరోగ్య సమస్యలపై అధ్యయనం చేసేందుకు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నిపుణులను పవన్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. పేరు కోసమో పార్టీ కోసమో రాజకీయం కోసమో ఈ సమస్యపై తాను స్పందించడం లేదనీ, ఒక మానవతా దృక్పథంతో సమస్యకు పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాను అని పవన్ అన్నారు. రాజకీయం చేయాలంటే ఇది పాలకుల నిర్లక్ష్యం అని విమర్శిస్తూ కూర్చోవాలనీ, దీని వల్ల సమస్యను సొల్యూషన్ దొరకదని పవన్ అన్నారు. ఏదేతైనేం, పవన్ చేస్తున్నది కచ్చితంగా మంచి పనే అనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున మంత్రి కామినేని స్పందించిన తీరు ఆసక్తికరంగా ఉంది!
ఈ తరుణంలో ఆరోగ్య శాఖమంత్రి కామినేని శ్రీనివాస్ ఏమన్నారంటే… పవన్ కల్యాణ్ తీసుకొచ్చిన హార్వర్డ్ విశ్వవిద్యాలయం బృందం ఇచ్చే సూచనలపై సీఎం చంద్రబాబు అత్యంత సానుకూలంగా స్పందిస్తారనీ, ఉద్దానం బాధితుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తారన్నారు. ఉద్దానం సమస్యను రాజకీయంతో సంబంధం లేదనీ, ఒక మంచి పని ఎవరైనా చేస్తుంటే దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్దానం సమస్యను పవన్ టేకప్ చేయడం వల్ల ఈ అంశం బాగా వెలుగులోకి వస్తుందని కామినేని చెప్పారు!
ఇదేంటీ.. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి స్పందించాల్సిన తీరు ఇదేనా అని ఆశ్చర్యం కలుగుతోంది కదా! సాక్షాత్తూ ఆయనే ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటూ.. ఉద్దానం సమస్యను పవన్ టేకప్ చేయడంతో వెలుగులోకి వస్తుందని చెప్పడమేంటీ..? ఉద్దానం ఇష్యూ ఇవాళ్లే కొత్తగా వచ్చింది కాదు. ఆ మధ్య చర్చనీయాంశం అయితే.. హుటాహుటిన కొన్ని డయాలసిస్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. శాశ్వత పరిష్కారం చూపించేస్తామంటూ ఆ తరుణంలో కామినేని కూడా అన్నారు. ఆ దిశగా వారు చేసిన ప్రయత్నాలేంటో వారికే తెలియాలి. నిజానికి, ఉద్దానం సమస్యపై శాశ్వత పరిష్కారం చూపించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికే ఉండి ఉంటే.. ఈ పాటికే విదేశాల నుంచి అధ్యయన బృందాలను తీసుకొచ్చేది! వారు తల్చుకుంటే హార్వర్డ్ కాకపోతే ఇంకో యూనివర్శిటీ వారిని రప్పించలేరా..? ప్రతీదానికీ విదేశాలనే ఆదర్శంగా చెబుతూ వచ్చే చంద్రబాబు సర్కారు, ఉద్దానం సమస్యకు ఆ స్థాయి పరిష్కారం చూపించాలని ఇంతవరకూ ఎందుకు ఆలోచించలేకపోయారు? ఆ ప్రయత్న లోపాన్ని కవర్ చేసుకోవడం కోసం అన్నట్టుగా… పవన్ టేకప్ చేశారు కాబట్టి, పవన్ చెప్పబోయే విషయాలపై సీఎం కృషి చేస్తారు కాబట్టి, ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం వస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి కామినేని ఇప్పుడు చెబుతుండటం విడ్డూరమే!