తెలంగాణలో ఏ కేసు అయినా సరే రెండు మూడు దశలు గడుస్తుంటుంది. మొదట చాలా హడావుడి హంగామా..ఎవరినీ వదిలేది లేదన్న ప్రకటనలు .. తర్వాత ఏమీ కొంప మునగలేదన్న సమర్థనలూ. ఇదో ప్రహసనం. ఇప్పుడు డ్రగ్స్ విషయంలోనూ అదే పునరావృతమవుతున్నది. కేసు తీవ్ర రూపంలో పోతున్నప్పుడు సిఎం కెసిఆర్ రివ్యూ అన్నారు.అలా అన్కా రీవ్యూ తప్పదని నేను రాశాను. నయీం కేసు నుంచి నేరెళ్ల ఘటన వరకూ అన్ని సందర్భాల్లోనూ జరుగుతున్నదే అది. డ్రగ్స్ కేసులో మరీ దూకుడుగా వెళితే సినిమా పరిశ్రమ స్థయిర్యం దెబ్బతింటుందనే ఒక వాదనను ప్రభుత్వం స్వీకరించినట్టు కనిపిస్తుంది. దాంతో కాస్త నెమ్మదింపచేశారు. మరోవైపున పెద్ద తలకాయలను వదలి తమను లక్ష్యంగా చేసుకున్నారని సినిమా వాళ్లు కొందరు గగ్గోలు పెట్టారు.అప్పటి నుంచి విచారణ వేగం, వివరాలు వెల్లడించడం కూడా నెమ్మదించింది. ఇద్దరు ముగ్గురు మంత్రులే సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్టు మాట్లాడారు. పరిశ్రమ ప్రముఖులుకొందరు, పాలక రాజకీయ వేత్తలు మరికొందరు ఈ వ్యవహారంతో ప్రత్యక్ష సంబంధం కలిగివున్నారని చాలా ఆరోపణలు పేర్లతో సహా వచ్చాయి. ఆ దశలో ముఖ్యమంత్రి కెసిఆర్ మరోసారి జోక్యం చేసుకుని హైదరాబాదులో డ్రగ్స్ సమస్య చాలా పరిమితంగానే వుందని కొత్త భాష్యం చెప్పారు.ఒకవేళ అది నిజమే అయినా అలా చెప్పడం వల్ల ఎవరికి మేలు? నయీం విషయంలోనూ మియాపూర్ భూ కుంభకోణంలోనూ ఇదే తరహా చూశాం. అక్కడ ఒక ఎకరా పోలేదని ఒక్క రూపాయినష్టం కాలేదని ఆయనే ముందస్తుగా చెప్పేశారు. అలాగే ఇప్పుడు విషయంలోనూ ఆయన మాటలూ ప్రభుత్వ చేతల కారణంగా మరో విడతగా బయిటకు రావలసిన పేర్లు ఆగిపోయాయాట. దొరికితేనే కదా దొంగలు.. లేకుటే దొరలే!