లెజెండ్‌తో జగపతిబాబు కెరీర్ గొప్ప టర్నింగ్ తీసుకొంది. జగపతిబాబు ఉన్న సినిమాలు ఎన్ని ఆడాయి? అనేది పక్కన పెడితే – ఆర్థికంగా జగ్గూభాయ్ సెటిల్ అయిపోవడానికి ఓ ఆస్కారం దక్కింది. ఇప్పుడు మరోసారి బోయపాటి శ్రీను ‘జయ జానకి నాయక’లో అదిరిపోయే పాత్ర ఇచ్చాడట! ఇది జగ్గూని మరో స్టైల్లో చూపించబోతోందని టాక్. అయితే ఈ సినిమా వరకూ జగపతి బాగా కష్టపడాల్సివచ్చింది. స్టైల్ విషయంలో పెద్దగా మార్పులేం చేయకపోయినా… డైలాగుల విషయంలో అరిపించేశాడట. ఓ డైలాగ్ కోసం… దాదాపుగా 25 టేకులు తీసుకోవాల్సివచ్చిందట. ఆ డైలాగ్ పూర్తి చేయడానికి రెండు రోజులు పట్టిందట. డబ్బింగ్ థియేటర్లో కూడా.. జగ్గూభాయ్‌ని బోయపాటి బాగా పిండేశాడట.
సాధారణంగా.. డబ్బింగ్ విషయంలో జగపతిబాబు చాలా కేర్‌గా ఉంటాడు. డైలాగులన్నీ ఈజీగానే చెప్పేస్తాడు. కానీ బోయపాటి పక్కన నిలబడి… ప్రతీ ఎక్స్ప్రెషన్ చెప్పి పలికించుకొన్నాడట. ”ఆఖరికి ఊపిరి ఎలా తీసుకోవాలో కూడా నేర్పించేలా ఉన్నాడు” అంటూ జగపతిబాబు బోయపాటికి కాంప్లిమెంట్ లాంటి కామెంట్ ఇచ్చేశాడు. మరి ‘లెజెండ్’తో కొత్త స్టార్డమ్ తెచ్చుకొన్న జగపతిబాబు… జయ జానకీ నాయకలో ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.