ఈనెల 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా, భీమవరంలో ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బ్యానర్లను ప్రభాస్ అభిమానులు చింపి వేశారనే అనుమానంతో పవన్ కళ్యాణ్ అభిమానులు వారి ఇళ్ళపై దాడులు చేసి విద్వంసం సృష్టించారు. ఆ సందర్భంగా కొన్ని ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరిగింది. ఆయన వీరాభిమానులమని చెప్పుకొని తిరుగుతున్నవారి ఆయన ఆశయాలను, సామాజిక స్పృహ, బాధ్యతని ఏమాత్రం పట్టించుకోకుండా విధ్వంసానికి పాల్పడి ఆయనకు తీరని అప్రదిష్ట తెచ్చారు.
ఈ గొడవపై పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఇద్దరూ ఇంతవరకు స్పందించలేదు. కానీ ఈ వ్యవహారంపై మీడియాలో వచ్చిన వార్తలు చూసిన పవన్ కళ్యాణ్, తన అభిమానుల వలన కలిగిన నష్టాన్ని భరించేందుకు ముందుకు వచ్చారు. అభిమానుల దాడిలో నష్టపోయినవారి కోసం అత్యవసరంగా ఆయన రూ.3లక్షలు పంపినట్లు భీమవరం యస్.ఐ. తెలియజేసారు. మొత్తం ఎంత నష్టం జరిగిందో అంచనా వేసిన తరువాత మిగిలిన మొత్తం కూడా పంపుతానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లు సమాచారం. అభిమానులు చేసిన తప్పుకి ఆయన మూల్యం చెల్లించవలసి వస్తోంది. ఇది ఆయన అభిమానులకు చెంప దెబ్బ వంటిదే. నిజానికి ఆయన దీనికి బాధ్యత వహించకపోయినా అడిగేవారుండరు. కానీ అది తన బాధ్యత అని పవన్ కళ్యాణ్ భావించి ఆ నష్టాన్ని భరించేందుకు ముందుకు వస్తున్నారు. కనీసం ఇప్పటికయినా ఆయన అభిమానులు తమ రియల్-లైఫ్-హీరోని ఆదర్శంగా తీసుకొని బాధ్యతగా వ్యవహరిస్తే బాగుంటుంది.