పూరి దగ్గర ఓ మ్యాజిక్ ఉంది. తను ఫ్లాపుల్లో ఉన్నప్పుడు కూడా.. హిట్ హీరోల్ని ఒప్పించగలడు. కథల్లో, పనితీరులో పదును తగ్గిందన్న విమర్శలు వినిపిస్తున్నా – స్టార్లతో సినిమాలు చేయగలడు. అదేంటో గానీ, తనతో ఒక్కసారి పనిచేస్తే… వెంటనే ప్రేమలో పడిపోతారు. పూరి కూడా తన హీరోని ఆస్థాయిలో ప్రేమించేస్తాడు. సినిమా చేస్తున్నంత సేపూ… సదరు హీరోకి అభిమానిగా మారిపోతాడు. ప్రస్తుతం పూరి… నందమూరి బాలకృష్ణ ప్రేమలో ఉన్నాడు. ఇద్దరి కాంబినేషన్లో ‘పైసా వసూల్’ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ముందు పూరీకీ బాలయ్యకు మధ్యగా పెద్దగా సంబంధాలేం లేవు. ‘హాయ్..’ అంటే ‘హాయ్’ అనుకోవడం అంతే. ఇద్దరూ కలసి పనిచేద్దాం అని కూర్చున్న దాఖలాలూ లేవు. అనుకోకుండా ‘పైసా వసూల్’ ప్రాజెక్ట్ ఫైనల్ అయిపోయింది.
షూటింగ్ మొదలైందో లేదో ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఓ హీరో – దర్శకుడు మింగిల్ అయిపోతే ఆ రిజల్ట్ వేరేలా ఉంటుంది. అది.. ‘పైసా వసూల్’లో కనిపించిందని సమాచారం. బాలయ్య ని సరికొత్తగా చూపించడంలో పూరి సఫలీకృతుడయ్యాడని రషెష్ చూసినవాళ్లు చెబుతున్నారు. బాలయ్య కూడా పూరి స్టైల్‌కి పడిపోయాడట. ‘బాలయ్యని అభిమానులు ఎందుకు ఇంతగా అభిమానిస్తారో నాకు అర్థమైంది. నేనూ బాలయ్యకు అభిమానిగా మారిపోయా. జూబ్లీ హిల్స్ లో బాలయ్య అభిమాన సంఘం పెడితే.. నేనే అధ్యక్షుడ్ని’ అంటూ బాలయ్యపై పూరి తన అభిమానాన్ని కురిపించేస్తున్నాడు. ‘పైసా వసూల్’ రిజల్ట్ ఏమైనా సరే… వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రావడం ఖాయమన్నది ఇన్‌సైడ్ వర్గాల టాక్. పూరి అంతలా పడగొట్టేశాడు బాలయ్యని. పూరినా మజాకా..??