కాపుల రిజర్వేషన్ల అంశమై ఏపీ సర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ముద్రగడ పద్మనాభం చేపట్టిన పాదయాత్రను అడ్డుకోవడంతో మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. ఎప్పుడో ఎన్నికల ముందు ఇచ్చిన రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకోలేక, ముద్రగడ ఉద్యమాన్ని అడ్డుకునేందుకు అధికారాన్ని అడ్డం పెట్టుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఏడాది ఆగస్టు నాటికే మంజునాథ కమిషన్ రిపోర్టు వస్తుందని ప్రభుత్వం ఆశించినా, ఇప్పటికీ దానిపై ఒక క్లారిటీ రాకపోవడం… నివేదిక త్వరగా ఇవ్వాలంటూ ప్రభుత్వమే కమిషన్ కు లేఖ రాయడం.. వెరసి ఇదంతా చంద్రబాబు సర్కారు నాన్చుడు ధోరణిగానే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. సరిగ్గా, ఇదే తరుణంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలుసుకున్నారు. వారి భేటీలో కాపుల రిజర్వేషన్ల అంశం కూడా చర్చకు వచ్చింది. ముద్రగడ పాదయాత్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసిన సందర్భంలో ప్రభుత్వానికి అండగా పవన్ నిలిచేసరికి… టీడీపీకి కొంత బాసట లభించినట్టయింది. ఆ ధైర్యం చంద్రబాబు స్వరంలోనే సుస్పష్టంగా కనిపిస్తోంది!
సీఎం, పవన్ భేటీ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. చంద్రబాబుతో ప్రయాణించి ఉన్న పరపతిని పోగొట్టుకోవద్దంటూ పవన్ కు ముద్రగడ సూచించారు. చంద్రబాబు అన్ని వర్గాలకూ హామీలు ఇచ్చారనీ అవన్నీ నీటి మీద రాతలే అని విమర్శించారు. కమిషన్ వేసి ఏడాదిన్నర దాటిందనీ, పల్స్ సర్వే చేయించి కూడా సంవత్సరం దాటిపోయిందని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు తమ జాతికి చెప్పిన అసత్యాలేంటో తెలియాలంటే గతంలో వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలను తెప్పించుకుని చదవాలంటూ పవన్ కు ముద్రగడ సూచించారు.
పవన్ కు ముద్రగడ రాసిన లేఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘాటుగానే స్పందించడం విశేషం! ముద్రగడ లేఖలో ‘మా జాతి’ అని ప్రస్థావించడాన్ని తప్పుబడుతూ… మరి, పవన్ కల్యాణ్ ఏ జాతికి చెందినవారనీ, ముద్రగడ జాతి కాదా అనీ, చివరికి తమ జాతి వారిని కూడా వేరు చేస్తూ ముద్రగడ మాట్లాడుతున్నారంటూ టీడీపీ నేతలతో చంద్రబాబు వ్యాఖ్యానించారు. ముద్రగడ లేఖలో వాడిన భాషను జాగ్రత్తగా గమనిస్తే, ఆయన ఎవరి తరఫున పనిచేస్తున్నారనేది ఇట్టే అర్థమౌతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ముద్రగడ లేఖ అంశం ప్రస్థావనకు రావడంతో చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించారు.
నిజానికి, ముద్రగడ పద్మనాభం ఉద్యమించాలనుకుంటున్న ప్రతీ సందర్భంలోనూ ప్రభుత్వం మోకాలడ్డుతున్న సంగతి తెలిసిందే. అయితే, ముద్రగడ విమర్శలకు చంద్రబాబు స్పందించిన సందర్భాలు గతంలో పెద్దగా లేవు. చినరాజప్ప మాట్లాడతారు, లేదంటే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు మాట్లాడతారు. ఇంకా చెప్పాలంటే… డీజీపీ సాంబశివరావు మాట్లాడతారు! ఈ మధ్య కాలంలో కాపుల రిజర్వేషన్ల విషయమై ముఖ్యమంత్రి ఇంత ఘాటుగా స్పందించిన సందర్భం ఇదే. ఇదంతా పవన్ కల్యాణ్ ఇచ్చిన ఆక్సిజన్ అనుకోవచ్చు! ముద్రగడ యాత్ర గురించి పవన్ మాట్లాడుతూ.. శాంతిభద్రతల సమస్య కూడా ముఖ్యమైందే కదా అంటూ సున్నితంగా కామెంట్ చేశారు. దీన్ని టీడీపీ తమకు అనుకూలంగా అర్థం చేసుకుంది. దీంతో టీడీపీకి కొంత ఊరట లభించిందని చెప్పొచ్చు.