ముస్లిం ప్రజల పవిత్ర పుణ్యక్షేత్రం మక్కాలో శుక్రవారం సాయంత్రం ఘోర దుర్ఘటన జరిగింది. మక్కా మశీదు సమీపంలో జరుగుతున్న నిర్మాణ కార్యక్రమాలలో ఉపయోగిస్తున్న ఒక భారీ క్రేన్ ఒక భవనంపై అకస్మాత్తుగా కూలిపోవడంతో దాని క్రిందపడి 107మంది మరణించారు. మరో 238 మంది గాయపడ్డారు. మక్కాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. క్రేన్ తో పనిచేస్తున్న సమయంలో చాలా జోరుగా ఈదురుగాలులు వీచడంతో భవనంపై కుప్ప కూలింది. మక్కా మశీదుపైనే క్రేన్ కూలినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మశీదు పక్కనే యాత్రికులు బస కోసం ఏర్పాటు చేసిన భారీ భవనంపై పడినట్లు భిన్నమయిన వార్తలు వినిపిస్తున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి వైద్య చికిత్సలు అందజేస్తున్నారు.