తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ద్వితీయ ప్రత్యామ్నాయంగా ప్రజలు చూస్తున్నారంటూ ఆ మధ్య కొన్ని సర్వేలు వచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన రహస్య సర్వేలో కూడా ఈ ఫలితాలు వచ్చాయనీ, తెరాస తరువాత ప్రజల ఆదరణ పొందుతున్న పార్టీగా కాంగ్రెస్ ఉందనీ అన్నారు. దీంతో కాంగ్రెస్ నేతల్లో ఒకింత ఉత్సాహం కనిపించింది. గతంలో లేని కలిసికట్టుతనమూ కనిపించింది. అయితే, అది మూణ్ణాళ్ల ముచ్చటే అనుకోండి. ఇప్పటికీ ఆ పార్టీని ఆధిపత్య పోరు పట్టిపీడిస్తోంది. ప్రక్షాళనలో భాగంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి దిగ్విజయ్ సింగ్ ను అధిష్టానం తప్పించింది. పనిలోపనిగా పీసీసీ పదవి మార్పు కూడా తప్పదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ను బలోపేతం చేయడంపై హైకమాండ్ ప్రత్యేక దృష్టి సారిస్తోందని అర్థమౌతోంది. అందుకే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పట్నుంచే జాగ్రత్త పడుతున్నారని చెప్పొచ్చు! తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే తెలంగాణ ద్రోహి అన్నట్టుగా చిత్రించే ప్రయత్నం మరోసారి చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకూ దద్దమ్మలూ సన్నాసులూ అంటూ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ వచ్చిన కేసీఆర్, ఇప్పుడు కాంగ్రెస్ ఇమేజ్ ను ప్రభావితం చేసే విధంగా వ్యాఖ్యానించడం గమనార్హం.
తెలంగాణ ఉద్యోగులు, నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టింది కాంగ్రెస్ పార్టీ అని సీఎం కేసీఆర్ విమర్శించారు. ముల్కీ నిబంధనలు ఉండాలని సుప్రీం కోర్టు చెప్పినా బేఖాతరు చేసి, రాజ్యాంగ సవరణ చేసి మరీ ముల్కీ నిబంధనల్ని రద్దు చేసిందన్నారు. 2004 నాటికి అప్పటికే కాంగ్రెస్ చతికిలపడిపోయి ఉందనీ, తమ పాపాలు కడుక్కున్నామని, తెలంగాణ ఇస్తామని నమ్మబలికి తెరాసతో దోస్తీ కట్టిందన్నారు. అలా అధికారం దక్కించుకున్న తరువాత, మరోసారి కొన్ని వందల మంది మరణించడానికి కారణమైందన్నారు. మంచిగా అడిగితే రాష్ట్రం ఇవ్వలేదనీ, దాదాపు పదేళ్లపాటు రాచి రంపాన పెట్టి, ఆ తరువాత ఎప్పుడో పదో సంవత్సరం చివర్లో… దేశమంతా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి కాబట్టి, కనీసం తెలంగాణ ఇవ్వడం ద్వారా అయినా ఇక్కడ గంజినీళ్లు దొరుకుతుందేమో అనే ఆశతో రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. అంతేతప్ప, ప్రజలపై ప్రేమతో తెలంగాణ ఇయ్యలేదన్నారు. అందుకే, గడచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఘోరంగా తిరస్కరించారని కేసీఆర్ చెప్పారు.
కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ తాజాగా చేసిన విమర్శలివి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని ప్రజల తిరస్కరణగా చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగులు, నిరుద్యోగులకు ద్రోహం చేసింది కూడా ఆ పార్టీయే అన్నారు. ఉద్యమ సమయంలో వందల మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరే అని చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికి, తెలంగాణ సెంటిమెంట్ ను మరోసారి తెరమీదికి తీసుకొచ్చి…ప్రజల్లో కాంగ్రెస్ పై మరింత వ్యతిరేకత పెంచే మాధ్యమంగా ప్రయోగిస్తున్నారు. మరి, కేసీఆర్ విమర్శల వెనక రాజకీయ ప్రయోజనాన్ని టి. కాంగ్రెస్ నేతలు అర్థం చేసుకుంటారా.. అంటే, అనుమానమే! ఎందుకంటే, వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది తేలితే తప్ప, పార్టీ కోసం మనస్ఫూర్తిగా పనిచేయలేం అనే ఆలోచనతోనే కొంతమంది నేతలు వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తోంది. ఈలోపు పుణ్యకాలం పూర్తవకుండా ఉంటుందా..?