నంద్యాల ఉప ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు ఎవరికి ఉంటుందనే చర్చ.. ఆ నియోజక వర్గంలో హాట్ టాపిక్ గా మారినట్టు తెలుస్తోంది. నిజానికి, నంద్యాల ఉప ఎన్నికలో తన మద్దతు ఎవరికి అనే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనీ, కొద్దిరోజుల్లో ఆలోచించి చెప్తానని మాత్రమే అమరావతిలో పవన్ కల్యాణ్ చెప్పారు. దీంతో త్వరలోనే ఆయన నిర్ణయం ప్రకటన ఉంటుందనీ, అది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే ఉంటుందని భూమా అఖిల ప్రియ వర్గం ధీమాతో ఉంది. పవన్ కల్యాణ్ తో తన కుటుంబానికి చాన్నాళ్లుగా సత్సంబంధాలు ఉన్నాయని మంత్రి అఖిల ప్రియ చెబుతున్నారు. ఆయనంటే తమకు ఎంతో అభిమానం, ప్రేమ, గౌరవమనీ, నంద్యాల ఉప ఎన్నికల్లో పవన్ కల్యాణ్ మద్దతు తమకే ఉంటుందని ఆమె అన్నారు.
గతంలో భూమా నాగిరెడ్డి ప్రజారాజ్యంలో చేరిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచే మెగా ఫ్యామిలీతో తమకు అనుబంధం ఉందనే విషయాన్ని నంద్యాల ప్రజలకు అఖిల ప్రియ గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతోపాటు.. ఇన్నాళ్లూ తెలుగుదేశం పార్టీ కాస్త దూరంగా ఉంటున్నట్టు పవన్ వైఖరి ఉండేది. అయితే, దాదాపు రెండేళ్ల తరువాత సీఎం చంద్రబాబుతో తాజాగా పవన్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఉద్దానం కిడ్నీ బాధితుల విషయమై ముఖ్యమంత్రిని కలుసుకునేందుకు పవన్ వెళ్లారు. పనిలోపనిగా చంద్రబాబు చేపడుతున్న కార్యక్రమాలను పవన్ మెచ్చుకున్నట్టుగా కథనాలు వచ్చాయి. ప్రెస్ మీట్ లో కూడా నంద్యాల ఉప ఎన్నిక గురించి పవన్ మాట్లాడారు. దీంతో ఈ సందర్భాన్ని నంద్యాల ఉప ఎన్నికల్లో తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని చెప్పొచ్చు.
‘పవన్ కల్యాణ్ తమవైపే ఉన్నారు’ అని ప్రచారం చేసుకోవడం ద్వారా నంద్యాల నియోజక వర్గంలో దాదాపు 30 వేల మందిని ప్రభావితం చెయ్యొచ్చనేది టీడీపీ ఆలోచనగా కనిపిస్తోంది. ఆ సామాజిక వర్గంతోపాటు, పవన్ అభిమానులు, పవన్ ఆశయ సాధన కమిటీ సభ్యులు, సేవాదళ్ కార్యకర్తలు, జనసేన అభిమానులు.. ఇలా నియోజక వర్గంలో చాలామందిని పవన్ మద్దతు పేరుతో ఆకర్షించే అవకాశం ఉంది. పవన్ తన నిర్ణయాన్ని రేపోమాపో ప్రకటిస్తారనే ప్రచారం నంద్యాల టీడీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఉప ఎన్నికలో టీడీపీకి మద్దతు పవన్ ప్రకటిస్తే వైకాపాకి ఎక్కడ నష్టం జరుగుతుందనే లెక్కల్ని ప్రతిపక్షం కూడా ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్టు చెబుతున్నారు.
పవన్ పై టీడీపీ ఆశలు ఇలా ఉంటే… జనసేన వర్గాల్లో ఇంకో అభిప్రాయం వినిపిస్తోంది. నంద్యాలలో జరుగుతున్నది ఉప ఎన్నిక కాబట్టి, అక్టోబర్ వరకూ తాను క్రియాశీల రాజకీయాల్లోకి రానని పవన్ చెబుతున్నారు కాబట్టి, ఆలోపు జరుగుతున్న ఉప ఎన్నిక విషయమై పవన్ కల్యాణ్ తటస్థంగా ఉంటే మంచిదనే అభిప్రాయం కూడా వ్యక్తమౌతున్నట్టు తెలుస్తోంది. ఒకటి మాత్రం నిజం, నంద్యాల విషయమై పవన్ స్పందించినా స్పందించకపోయినా తెలుగుదేశం పార్టీ చేయాల్సి ప్రచారాన్ని చేసేసుకుంటుందనే చెప్పొచ్చు.