సమరసింహారెడ్డి లెక్క వేరు! తెలుగునాట బాషా టైపు సినిమా అది. సమరసింహారెడ్డి తరవాత అదే టైపు ఫ్లాష్ బ్యాకులతో చాలా సినిమాలొచ్చాయి. అందులో దాదాపుగా అన్నీ హిట్టయ్యాయి. ఓ హీరో – తన గతాన్ని వదిలి – సామాన్యమైన జీవితం గడుపుతుంటాడు. సడన్ గా ఓ రోజు మళ్లీ తన ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. పూర్వాశ్రమానికి వెళ్లి – శత్రువుల అంతు చూసి – కథని సుఖాంతం చేస్తుంటాడు. ఈ ఫార్ములా చాలా కాలం కొనసాగింది. అయితే ఈమధ్య బాషా ఫ్లాష్ బ్యాక్‌ల హంగామా బాగా తగ్గింది. లేటెస్టుగా… నందమూరి బాలకృష్ణ మళ్లీ ఈ తరహా కథ ఎంచుకొన్నాడు. బాలయ్య 102వ చిత్రం ఈరోజు రామోజీ ఫిల్మ్‌సిటీలో మొదలైంది. కె.ఎస్.రవికుమార్ దర్శకుడు. ఇది కూడా సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి కథే! హీరోకి ఓ బలమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అదంతా వదిలి.. సామాన్యుడిగా జీవితం కొనసాగిస్తుంటాడు. అదీ.. కథ. ఇందులో బాలయ్య గెటప్ చూసినా సమరసింహారెడ్డి రోజులు గుర్తుకు రావడం ఖాయం. రెడ్డిగారు, జయసింహా అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయి. దాదాపుగా జయసింహానే ఖాయం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.