శుక్రవారం రెండు సినిమాలు విడుదల అవుతున్నాయి. నక్షత్రం, దర్శకుడు బాక్సాఫీసు దగ్గరకు రాబోతున్నాయి. కృష్ణవంశీ సినిమా కాబట్టి, సందీప్ కిషన్ – సాయిధరమ్ తేజ్ ఉన్నారు కాబట్టి, రెజీనా, ప్రగ్యాలతో గ్లామర్ తళతళలాడుతోంది కాబట్టి నక్షత్రం సినిమాకి బాగా డిమాండ్ ఉంటుంది, టికెట్లు బాగా తెగుతాయి అనుకొన్నారు. కానీ.. సీన్ ఇప్పుడు రివర్స్ అవుతుందేమో అనిపిస్తోంది. నక్షత్రం నుంచి ఎలాంటి హడావుడీ లేదు. విడుదలకు ముందు పబ్లిసిటీ భారీ రేంజులో ఉండాల్సింది.. అసలు అజా పజా లేకుండా పోయింది. కృష్ణవంశీ ఇంటర్వ్యూలు మినహా… నక్షత్రం నుంచి చప్పుడు లేదు. అదే సమయంలో దర్శకుడు పబ్లిసిటీ ఓ రేంజ్లో జరుగుతోంది. ప్రెస్ మీట్లు , ఇంటర్వ్యూలతో హడావుడి చేస్తున్నారు. ఎన్టీఆర్, రామ్చరణ్, బన్నీ లను రంగంలోకి దింపి సుకుమార్ ప్రమోషన్లకు ఓ రేంజులోకి తీసుకెళ్లాడు. ఆఖరికి చిరంజీవిని కూడా వాడేశాడు. ఎక్కడ చూసినా.. దర్శకుడు గురించే. రేప్పొద్దుట బాక్సాఫీసు దగ్గర కూడా నక్షత్రం సినిమాని దర్శకుడు బీట్ చేసేలానే ఉంది. నక్షత్రంలో విషయం ఉండి.. దర్శకుడిలో సత్తా లేకపోతే ఏం చేయలేం గానీ- దర్శకుడు ఏమాత్రం నచ్చినా… నక్షత్రం వెలవెల బోవడం ఖాయం. అదేంటో కృష్ణవంశీకి ప్రతిసారీ ఇలానే జరుగుతుంటుంది. సినిమాకి క్రేజ్ వచ్చినా.. చివర్లో ప్రమోషన్లపై దృష్టి పెట్టకపోవడం ప్రతికూలంగా మారుతోంది. ఇప్పుడూ అంతేనేమో.