రివ్యూలపై కమర్షియల్ దర్శకులకు ఎప్పుడూ సదాభిప్రాయం ఉండదు. రివ్యూవర్స్ సరిగా ఆలోచించడం లేదని, కామన్ మెన్ నాడీని పట్టుకోలేకపోతున్నారని చాలామంది బాహాటంగానే విమర్శించారు. రివ్యూలకు, వసూళ్లకు సంబంధం ఉండదని – అల్లు అర్జున్ లాంటి వాడే మైక్ పట్టుకొని గర్జించాడు. మాస్ దర్శకులందరికీ రివ్యూ విధానం పెద్దగా నచ్చదు. ఇప్పుడు సంపత్ నంది కూడా రివ్యూలపై అలిగాడు. తను దర్శకత్వం వహించిన చిత్రం `గౌతమ్ నంద`. రొటీన్ కథ అని, కథనంలో దమ్ము లేదని రివ్యలన్నీ తేల్చేశాయి. దాదాపుగా అన్ని రివ్యూలూ నెగిటీవ్ విషయాలనే ఎత్తి చూపించాయి. రేటింగులూ తక్కువ ఇచ్చాయి. ఇప్పుడు సంపత్ నంది ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు.
”నిజాయతీగా ఒప్పుకోవాలంటే నా సినిమాకి రివ్యూలు, రేటింగులు సరిగా రాలేదు.. కానీ వసూళ్లు మాత్రం బాగున్నాయి. మౌత్ టాక్ని నమ్మి.. జనాలు థియేటర్లకు వెళ్తున్నారు” అని సంపత్ నంది అంటున్నాడు. గౌతమ్ నంద విడుదలై వారం అయ్యింది. తొలి వారం రూ.22 కోట్లు సాధించామని నిర్మాతలు లెక్కలు చెబుతున్నారు. అది గ్రాస్ మాత్రమే. షేర్ గా మార్చుకొంటే గౌతమ్ నంద వసూళ్లు రూ.15 కోట్లు కూడా అందుకోలేదు. రేపటి నుంచి మరో రెండు కొత్త సినిమాలొస్తున్నాయి. రెండో వారంలో గౌతమ్ నంద జోరు మరింత తగ్గడం ఖాయం. ఈ సినిమాకి దాదాపుగా రూ.25 కోట్ల బడ్జెట్ అయ్యిందని నిర్మాతలే చెప్పారు. సో… గౌతమ్ నంద నష్టాలు పక్కా అన్నమాట.