ఉప ఎన్నిక నేపథ్యంలో నంద్యాలలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అబద్ధాలు చెప్పని వారిని సత్య హరిశ్చంద్రుడు అంటారనీ, జీవితంలో ఒక్కసారి కూడా నిజం మాట్లాడని వ్యక్తిని నారా చంద్రబాబు అంటారని ఎద్దేవా చేశారు. నంద్యాల ఉప ఎన్నికను ధర్మ యుద్ధం అన్నారు. న్యాయానికీ అన్యాయానికీ, ధర్మానికీ అధర్మానికీ జరుగుతున్న యుద్ధం ఇదన్నారు. ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా క్యాబినెట్ మొత్తాన్ని నంద్యాలలోనే కొలువుదీర్చామనీ, ముఖ్యమంత్రీ ఆయన కుమారుడూ నంద్యాల రోడ్లపై తిరుగుతున్నారంటూ ధ్వజమెత్తారు. నంద్యాల ఎన్నికను ఏకగ్రీవం చేసి ఉంటే ప్రభుత్వం ఇన్ని అభివృద్ధి పథకాలను హుటాహుటిన ప్రకటించి ఉండేదా అని ప్రశ్నించారు. పోటీకి దిగకపోయి ఉంటే నంద్యాలపై ఒక్క రూపాయి కూడా విదిల్చేవారు కాదనీ, మంత్రులెవ్వరూ ఇలా నియోజక వర్గంలో కనిపించేవారు కాదని జగన్ అన్నారు. వైకాపా నుంచి అభ్యర్థిని పోటీలో దింపడం వల్లనే టీడీపీ సర్కారుకు ఈ పనులన్నీ చేస్తోందన్నారు.
నంద్యాల ఉప ఎన్నికను 2019లో జరగబోతున్న కురుక్షేత్రానికి నాంది అని వైయస్ జగన్ అన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ సంగ్రామంతో జగన్ ముఖ్యమంత్రి కాకపోవచ్చునేమోగానీ, 2019 ఫలితాలకు నంద్యాల ఉప ఎన్నిక నాంది పలుకుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాకి అది చేస్తాం, ఇది తెస్తాం అంటూ ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చారనీ, వాటిలో నెరవేర్చినవి ఎన్నున్నాయో చంద్రబాబు చెప్పగలరా అంటూ డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తాము డిమాండ్ చేస్తుంటే కేసులతో భయపెట్టేందుకు ప్రయత్నిస్తారని జగన్ చెప్పారు. ఈ సందర్భంగా నంద్యాలపై కొన్ని వరాలు కురిపించారు జగన్. నంద్యాల అభివృద్ధి బాధ్యతను తానే తీసుకుంటాననీ, ఇళ్లు లేనివారికి ఇళ్లు కట్టించి ఇస్తాననీ, నంద్యాలను మోడల్ టౌన్ గా తీర్చుదిద్దుతాననీ, వ్యవసాయ వర్శిటీని కూడా తెప్పిస్తానని జగన్ హామీలు ఇచ్చారు.
దీంతోపాటు నవరత్న హామీలను కూడా ప్రస్థావించారు. రాష్ట్ర చరిత్రను తాను మార్చబోతున్నాననీ, కుల మత ప్రాంత వర్గ విభేదాలకు అతీతంగా నవరత్నాలు అందరికీ అందేలా చేస్తామని చెప్పారు. నంద్యాలను జిల్లా చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను 25 చేస్తానని కూడా మాటివ్వడం గమనార్హం! దీంతోపాటు ఫిరాయింపు నేతలపై కూడా జగన్ సీరియస్ అయ్యారు. దొంగ నేతలతో ప్రభుత్వం నడుస్తోంది, దొంగలతో ప్రభుత్వం నడుపుతున్న చంద్రబాబును ఏమనాలంటూ ఎద్దేవా చేశారు.
జగన్ ప్రసంగ పాఠమంతా ఉద్వేగ భరితంగా సాగిందనే చెప్పాలి. నంద్యాల ఉప ఎన్నికను 2019 సార్వత్రిక ఎన్నికలకు ప్రారంభంగా జగన్ అభివర్ణించడం విశేషం. నంద్యాలను జిల్లాగా ప్రకటించడంతోపాటు, రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను కూడా పాతికకు పెంచుతామని చెప్పడం కూడా విశేషమే. నిజానికి, ఈ హమీని ఒక నియోజక వర్గం ఉప ఎన్నిక సందర్భంగా ఇవ్వడం ఒకింత ఆశ్చర్యకరమైన అంశం. వైకాపా టిక్కెట్టుపై గెలిచి, వేరే పార్టీలోకి వెళ్లినవారిని దొంగలు అంటూ జగన్ అభివర్ణించడం బాగుంది! కానీ, నంద్యాల ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి ఎవరు..? శిల్పా మోహన్ రెడ్డి కూడా టీడీపీ నుంచి వైకాపాలోకి వచ్చినవారే కదా! సో.. ఫిరాయింపులూ గోడ దూకుళ్ల విషయంలో అన్ని పార్టీలూ ఆ తానులో ముక్కలే. ఒకర్నొకరు వేలెత్తి చూపించుకోవాల్సిన పనిలేదు.
ఇక, తాము పోటీకి పెట్టడం వెళ్లనే చంద్రబాబు సర్కారు నంద్యాల అభివృద్ధికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారనీ, పోటీకి దిగకుంటే ఒక్క రూపాయైనా విదిల్చేవారా అంటూ జగన్ ప్రశ్నించారు.. బాగుంది. మరి, జగన్ కూడా ఇప్పటికిప్పుడే నంద్యాలను జిల్లా చేసేస్తాననీ, మోడల్ టౌన్ చేసేస్తాననీ, అభివృద్ధి బాధ్యతను తనకు వదిలేయమనీ.. ఇలా కొన్ని హామీలు ఇచ్చేశారు కదా! ఒకవేళ, తెలుగుదేశం పోటీకి దిగి ఉండకపోతే.. నంద్యాలపై జగన్ కు ఇంత ప్రేమ అమాంతంగా వచ్చి ఉండేదా, వరాలు కురిపించి ఉండేవారా అనే వాదనకు కూడా ఆస్కారం ఉంటుంది కదా! ఏదైతేనేం, నంద్యాలతోపాటు రాష్ట్ర వైకాపా శ్రేణుల్లో కూడా ఎన్నికల వేడిని రగిలించేలా జగన్ సభ సాగిందని చెప్పొచ్చు. మరి, ఉప ఎన్నికలో దీని ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది వేచి చూడాలి.