తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కాంగ్రెస్ కమ్యూనిస్టులపై విరుచుకుపడే క్రమంలో నానా మాటలూ అన్నారు. శివతాండవమే చేశారు. అసహనంతో పాటు కొంత అభద్రత కూడా వుందని స్పష్టం చేసుకున్నారు. గతంలో బలమైన ముఖ్యమంత్రులుగా వున్న చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇలాగే కేవలం ప్రతిపక్షాలపై దాడి కోసమే మీడియా గోష్టులు జరిపిన సందర్భాలున్నాయి గాని కెసిఆర్ వాటిని మించి పోయారు. ముఖ్యమంత్రులు పార్టీల అధినేతలు ఆగ్రహంగా వున్నప్పుడు నచ్చని పార్టీలనే గాక పత్రికలనూ ఛానళ్లనూ కూడా తిట్టిపోయడం పరిపాటి. వైఎస్.ఎప్పుడూ ఆ రెండు పత్రికలు అంటుండే వారు. ఆ కోణంలో చూస్తే కొద్ది మాసాల కిందట ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన దాడికి ఇప్పుడు కెసిఆర్ చేసిన దాడికి మధ్య ఒక ముఖ్యమైన తేడా కనిపిస్తుంది. ఒక విలేకరి ప్రశ్న వేసినప్పుడు చంద్రబాబు నీదేపేపర్ ఏ పేపర్ అని పదే పదే అడిగారు. ఆ విలేకరి చెప్పిన తర్వాత అదే మీతో సమస్య- 10 టీవీ, సాక్షి, ప్రజాశక్తి ఇవన్నీ ఇలాగే చేస్తుంటాయి అని పేరు తీసి మరీ దాడి చేశారు. ప్రజాశక్తి విలేకరి ఏదో సమాధానం చెప్పబోతే అవకాశం ఇవ్వకుండా మరింత తీవ్రంగా మాట్లాడారు. ఇప్పుడు కెసిఆర్ కూడా తెలంగాణలో (ప్రజాశక్తి స్థానే వచ్చిన) నవతెలంగాణ పత్రికపై అదే విధంగా దాడి చేశారు. ఇలాటి పత్రిక అవసరమా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు సాక్షి అనే మరో పేరు కూడా తీసుకున్నారు గాని కెసిఆర్‌కు అది కూడా అవసరం లేకపోయింది. తెలంగాణలో మిగతా పత్రికలు ఛానళ్ల ప్రసారాలతో ఆయనకు ఏ సమస్య లేదన్నమాట. మరో భాషలో చెప్పాలంటే అవి ఆయనకు అనుకూలంగానే వున్నాయన్న మాట. ఎందుకంటే ఆంధ్రజ్యోతిపై మొదట్లో దీర్థకాలం వ్యతిరేక ఆంక్షలు అమలు జరిపి సర్దుబాటు చేసుకున్నారు. ఇప్పుడు ఏ పేచీ లేదు. ఈనాడు ఎప్పుడూ సమస్య కాదు. సాక్షికి ఎపిలో చంద్రబాబు నాయుడుపై వుండే కేంద్రీకరణ ఖచ్చితంగా కెసిఆర్‌పై వుండదు. అందుకే నవ తెలంగాణను మాత్రమే ఎంచుకుని తిట్టిపోశారు. దీనిపై శుక్రవారం ఆ పత్రిక అనేక సమాధానాలు ప్రచురించింది కూడా. అయితే అసలు సమస్య అధికారంలో వున్న వారు ఇలా ఒక పత్రికపై లేదా కొన్ని పత్రికలు ఛానళ్లపై దాడి చేయడం సరైందేనా? ఇలాటి అసహనం ప్రజాస్వామ్య విరుద్ధం కాదా?