కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం పాదయాత్ర ఇప్పటికి రెండు మూడు సార్లు ఆగిపోతున్నది. అయితే పోలీసుల మొహరింపు, ఉద్యమ కారుల సమీకరణ కారణంగా ఇప్పటికే కావలసినంత రాజకీయ ఉద్రిక్తత మాత్రం కొనసాగుతున్నది.ఇలాటి సమయంలోనే మరో యాత్రకు కూడా తీవ్ర ఆటంకాలు ఎదురవడం ఆసక్తికరం. రామన్మెగసెసె అవార్డు గ్రహీత, పర్యావరణ ఉద్యమ కారుడు రాజేంద్ర సింగ్ కృష్ణానది పరిరక్షణ యాత్ర చేస్తానని చాలా రోజుల కిందటే ప్రకటించారు. ఒక వాహనంలో ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టుకుని ఆయన యాత్ర తలపెట్టారు. దానిపై నీరుకొండ గ్రామం సమీపంలో తెలుగుదేశం అనుకూల రైతులు అడ్డుకుని రాళ్లదాడికి దిగినట్టు సమాచారం. రాజేంద్ర సింగ్ ప్రసంగాలలో రాజకీయాలు వుండవు. నూతన రాజధాని అమరావతి నిర్మాణం కృష్ణానదిపైన కొందవీటి వాగు ప్రవాహంపైనా చూపే ప్రభావం గురించి ఆందోళనలున్నాయి. అవి మాత్రం ఆయన పర్యటనలో ప్రస్తావనకు రావచ్చు. నిజానికి ప్రభుత్వం కూడా ఈ సమస్యను గుర్తించి తను తీసుకునే చర్యలను ఒక నివేదికగా ఎన్జిటికి అందజేసింది. అలాటప్పుడు రాజేంద్ర సింగ్ యాత్ర చేస్తే ప్రతిపక్షాలతో సమానంగా చూసి అడ్డుకోవడంలో అర్థం లేదు. తాము ఇష్టపూర్వకంగా భూములు ఇస్తే రాజధానికి అడ్డుతగులుతున్నారని రైతులు ఆరోపించినట్టు చెబుతున్నారు. వారి భూముల అప్పగింతకూ నది సంరక్షణకు సంబంధమే లేదు. ఏతావాతా రాజకీయమే ఇక్కడ ప్రధాన పాత్ర వహిస్తున్న మాట నిజం. తెలుగుదేశం నాయకత్వం ప్రభుత్వం కూడా ఆయనకు రక్షణ కల్పించి ఇలాటి దాడులు పునరావృతం కాకుండా చూడటం శ్రేయస్కరం లేకుంటే ఇప్పటి వరకూ రాష్ట్రానికే పరిమితమైన రాజకీయ వివాదం జాతీయంగానూ విస్తరిస్తుంది.