కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి పాదయాత్రకు ప్రయత్నించారు! ఆ తరువాతి సన్నివేశం షరా మామూలే! కిర్లంపూడిలో పహారా కాస్తున్న పోలీసులు ఆయన్ని అడ్డుకోవడం.. కాసేపు వాగ్వాదం… ఇంకాసేపు నిరసన.. చివరికి ముద్రగడ వెనుదిరిగి ఇంట్లోకి వెళ్లిపోవడం! కాపు రిజర్వేషన్ల కోసం జరుగుతున్న ఉద్యమంలో భాగంగా జరుగుతున్న రొటీన్ తంతు ఇదే. ఎన్నాళ్లు తనను అడ్డుకున్నా పాదయాత్ర ప్రయత్నం చేసి తీరతానంటూ ముద్రగడ ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు. దినచర్యలో భాగంగా ఉదయాన్నే యాత్రను ప్రారంభింస్తున్నారు. పోలీసులు అడ్డుకుంటారని ముందే తెలిసినా మళ్లీ మళ్లీ అదే పనిచేస్తున్నారు. పోలీసుల మీద ఉన్న గౌరవంతో వెనుదిరుగుతున్నా అని ప్రకటించేసి వెనక్కి వెళ్లిపోతున్నారు!
శుక్రవారం నాడు ముద్రగడకు మద్దతుగా కొంతమంది జేయేసీ నేతలు వచ్చారు. దీంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారేట్టుగా ఉందని పోలీసులు భావించారు. కానీ, రోజూలానే పోలీసులకు ముద్రగడ ఎదురుపడి, పాదయాత్రకు అనుమతి ఇవ్వాలన్నారు. రోజులానే పోలీసులూ అనుమతుల్లేవన్నారు. అలాంటప్పుడు, గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన అనుమతి పత్రాన్ని తమకిస్తే, దాని ప్రకారం దరఖాస్తు చేసుకుంటాం అని వాదించి, మళ్లీ వెనక్కి వెళ్లిపోయారు. గడచిన వారం రోజులుగా ఇదే మాట చెబుతున్నారు. అదే వాదన పోలీసుల ముందు వినిపిస్తున్నారు. దీన్లో ఏమాత్రం మార్పు రావడం లేదు!
ఇలా ఎన్నాళ్లు చేస్తారు అనేదే అసలు ప్రశ్న..? ఈ ధోరణి వల్ల ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉందిగానీ, ఉద్యమం ఒక్క అడుగైనా ముందుకు సాగుతోందా..? ‘పోలీసులు అడ్డుకుంటారు’ అని తెలిసి కూడా ప్రతీ రోజూ ఎందుకీ ప్రహసనం..? వారితో ప్రతీరోజూ ఎందుకీ ఒకే తరహా వాదన..? ఇంత జరుగుతున్నా ఇంకా పాదయాత్ర చేస్తాననే ముద్రగడ మంకుపట్టుదలతో ఎందుకు ఉన్నారు? అది సాధ్యం కాదని స్పష్టంగా తెలుసుకున్నాక, ఉద్యమ వ్యూహాన్ని మార్చుకోవాలి. కేవలం పాదయాత్ర చేస్తేనే తప్ప.. కాపుల రిజర్వేషన్ల ఉద్యమం ముందుకు సాగలేదా..? ప్రత్నామ్నాయ నిరసన మార్గాల గురించి ముద్రగడ ఎందుకు ఆలోచించడం లేదు..? ఎవరి కోసమైతే ఆయన ఉద్యమిస్తున్నారో, వారికే ముద్రగడ ఉద్యమం పట్ల రానురానూ నమ్మకం తగ్గిపోయే విధంగా వ్యవహరిస్తున్నారనడంలో సందేహం లేదు. ఆయన ఉద్యమం అంటే… కిర్లంపూడిలో పోలీసులు ఉంటారు, ముద్రగడ పద్మనాభం ఇంట్లో ఉంటారు! బయట ప్రపంచానికి అనిపిస్తున్నదీ, కనిపిస్తున్నదీ ఇదే. ఇప్పటికైనా వ్యూహం మార్చుకోకపోతే ఎలా..?