ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచీ ఉనికి చాటుకోవడం కోసమే అవస్థలు పడాల్సిన పరిస్థితి. మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టుగా… ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక ఆ పార్టీకి ఇంకో తలనొప్పిగా మారింది. నిజానికి, నంద్యాల ఎన్నికలో ప్రధాన పోటీ టీడీపీ, వైకాపాల మధ్య ఉంటుందన్నది సుస్పష్టం. అయినాసరే, తమకూ లాభించే అంశాలు కొన్ని ఉన్నాయన్న ధీమాతో కాంగ్రెస్ కూడా ఈ ఉప ఎన్నిక బరిలోకి దిగింది. అసలు సమస్య ఇక్కడి నుంచే మొదలైంది. ఒకప్పుడు, కాంగ్రెస్ టిక్కెట్ ఇస్తుందంటే ఎగబడి పోటీ పడే స్థాయిలో నేతలు ఉండేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నం. పార్టీ తరఫు ఎవరికి టిక్కెట్ ఇవ్వాలో అనే పరిస్థితి నెలకొంది! బతిమాలి మరీ అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవాల్సి వస్తోంది. ఎలాగోలా ఒక నాయకుడిని ఎంపిక చేసి, టిక్కెట్ ఇస్తున్నట్టు ప్రకటించినా.. ఎందుకో కాంగ్రెస్ పార్టీకి ఆ అభ్యర్థిపై నమ్మకం కుదరడం లేదని తెలుస్తోంది.
అబ్దుల్ ఖాదర్ ను అభ్యర్థిగా ఎంపిక చేశారు. నంద్యాల నియోజక వర్గంలో మైనారిటీలతో పాటు ఇతర వర్గాల్లో ఆయనకు మంచి పేరు ఉందనేది కాంగ్రెస్ అభిప్రాయం. అయితే, అభ్యర్థిని ఎంపిక చేసినా ఎందుకో ఆ పార్టీకి ఇంకా ధైర్యం చాలడం లేదట! ఇంతకీ, కాంగ్రెస్ ఆందోళన గెలుపు గురించి అయితే వినడానికి బాగానే ఉండేది. ఇప్పుడు ఎంపిక చేసిన అభ్యర్థి చివరి వరకూ ఉంటారా.. మధ్యలోనే ఏదో ఒక పార్టీలోకి గోడ దూకేస్తారా అనేది ఏపీ కాంగ్రెస్ ఆందోళనగా తెలుస్తోంది. ఎంపిక చేసిన అభ్యర్థిపై ఆ పార్టీలో కొన్ని అనుమానాలు వ్యక్తమౌతున్నాయట. టీడీపీ, లేదా వైకాపా నుంచి ఏదో ఒక ప్రలోభం రావొచ్చనీ, ఉన్నట్టుండి కాంగ్రెస్ అభ్యర్థి ప్లేటు ఫిరాయించేస్తే పార్టీ పరువు పోతుందని కొంతమంది నేతలు లోలోపల చర్చించుకుంటున్నారు. అందుకే, ముందస్తుగా కొన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. నంద్యాల ఎన్నికల్లో గెలవకపోయినా ఫర్వాలేదుగానీ, కాంగ్రెస్ మాత్రం చివరివరకూ బరిలో నిలిచి ఉండేలా చూడటమే వారి ముందున్న సవాల్ గా చెప్పుకుంటున్నారు.
ఇంతకీ, ఆ ముందస్తు ఏర్పాట్లు ఏంటంటే… షాడో అభ్యర్థుల్ని రంగంలోకి దించడం! ఖాదర్ తోపాటు మరో ఇద్దర్ని కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులుగా రంగంలోకి దించుతున్నట్టు సమాచారం. ఎందుకంటే, ఒకరు పోయినా మరొకరైనా ఉంటారన్నది వారి వ్యూహం. నామినేషన్లు పూర్తయిన తరువాత ఖాదర్ పోటీ నుంచి తప్పుకున్నా, లేదా పార్టీ తరఫున ప్రచారం చేయకుండా వ్యూహాత్మకంగా మౌనం వహించే ప్రయత్నం ఏదైనా చేసినా.. వెంటనే రెండో అభ్యర్థిని పార్టీ ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ, వైకాపా విజయం కోసం పోరాడుతూ ఉంటే, కాంగ్రెస్ కి మాత్రం అభ్యర్థిని నిలుపుకోవడమే ఒక పోరాటంగా మారింది! చివరికి వరకూ ఎన్నికల బరిలో నిలవడమే వారికి విజయం అన్నట్టుగా ఉంది!