నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం మొదటి రోజు నుంచి ఉద్రిక్త పూరితమైన వాదోపవాదాలు ఆరోపణల పర్వం ఆందోళన కలిగిస్తుంది. ఇది ఎవరి కారణంగా జరుగుతున్నా వారి ఉద్దేశాలు ఏవైనా ప్రజాస్వామ్యానికి ప్రజలకూ మాత్రం మంచిది కాదు. ఎన్నికల ప్రచారం వేడెక్కిన కొద్ది స్వల్ప ఘటనలు ఘర్షణలు జరగడం అసాధారణం కాదు గాని ఆదిలోనే అలాటివి ఎక్కువగా కనిపిస్తున్నాయంటే వాటివెనక వ్యూహాలు వున్నాయనుకోవాల్సిందే. ప్రతిపక్ష నేత జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబును కాల్చేయాలని వ్యాఖ్యానించడం పొరబాటే. దానిపై చట్టపరంగా ఫిర్యాదులు చేసుకోవడం కూడా రాజకీయాల్లో సహజమే. అయితే దాన్నే ఆయుధంగా చేసుకుని మొత్తం ప్రచారాన్ని అటే తిప్పడం మాత్రం సముచితమా? ఒక మంత్రి వర్యుడైతే దేంతో కాలుస్తావ్, ఎకె47తోనా? నాటుతుపాకితోనే? ఎప్పుడు కాలుస్తావ్? అంటూ రెట్టించి ఆయన ఒకసారి అంటే ఈయన పదిసార్లు అదే అనడం హాస్యాస్పదంగా వుంది. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహనరెడ్డి మాటలపైన దుమారం మొదలు పెట్టి ఇంటిముందు ధర్నాచేశారట. మేము ఆడవాళ్లం కాదు అని అన్నందుకు మహిళలతో ధర్నా చేయించారు. ఇప్పుడు వైసీపీ ఎంఎల్ఎ నటి రోజా నంద్యాలలో పర్యటిస్తుంటే అడ్డుకున్నారని కూడా వారు ఆరోపిస్తున్నారు. కిరాయి పుచ్చుకున్న మహిళలు అడ్డుపడుతున్నారనేది వైసీపీ వారి ఆరోపణ. రోజా అన్నాక ఎలాగూ తీవ్రభాషలో దాడి చేయడం తెలిసిన విషయమే.
నటిగానూ గ్లామర్ వుంటుంది గనక బహుశా నంద్యాల ప్రచారంలో ఆమె ప్రధాన పాత్ర పోషించవచ్చు. తమ మొదటి సభ విజయంతోనే భయంపట్టుకున్న టిడిపి ఇదంతా చేస్తున్నదనేది వైసీపీ పదేపదే చేస్తున్న ఆరోపణ, సాక్షి కథనాల సారాంశం. అయితే ఉద్రిక్తత పెరిగితే ప్రతిపక్షానికి కలిగే లాభం వుండదని వైసీపీ కూడా గ్రహించడం అవసరం. అవతలివారిపై ఆరోపణలు చేసినా తమ వైపు నుంచి సంయమనం పాటిస్తూ శాంతియుతంగా ఎన్నికల పోరాటం జరిగేట్టు చూడాల్సిన బాధ్యత ఇరుపక్షాలపైనా వుంది. ప్రభుత్వ పక్షంపై మరింత ఎక్కువగా వుంది.