తొందరపడి ఒక కోయిల ముందే కూసింది,, విందులు చేసింది అని రాశారు దేవులపల్లి కృష్ణశాస్త్రి. దీన్ని కాస్త సవరించి తొందరపడి ఒక సిఎం ముందే పొగిడారు అని పాడితే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు చక్కగా సరిపోతుంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం నోట్లరద్దు చేసినా జిఎస్టి తీసుకొచ్చినా అవసరాన్ని మించి ఆదరాబాదరగా ఆకాశానికెత్తారాయన. బిజెపి సిఎంల కన్నా ముందే తాను మద్దతిచ్చానని చెప్పుకున్నారు. స్వంత చొరవతో వెళ్లి ప్రధాని మోడీని కలిసి వచ్చారు కూడా. వాస్తవానికి అంతకు ముందు నోట్లరద్దు వల్ల కష్టనష్టాలపై ప్రభుత్వం నుంచి స్పందనలు వచ్చినా కెసిఆర్ అలా అన్నాక అంతా గప్చిప్ అయ్యారు. ఇప్పటికీ ఆ కష్టాలు కొనసాగడమే గాక హైదరాబాద్‌లో కొన్ని ప్రత్యేక సమస్యలు కూడా తిష్టవేశాయని బ్యాంకింగు నిపుణులు చెబుతున్నారు. ఇక జిఎస్టి వల్ల వేల కోట్ల నష్టం అని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఘోషిస్తున్నా కెసిఆర్ అత్యుత్సాహంతో ఆహ్వానించారు. పదే పదే పొగిడేశారు.మిషన్ భగీరథకూ ప్రాజెక్టుల వ్యయానికి సర్వీసు పన్ను రాయితీ వుంటుందని హామీ లభించిందన్నారు. తీరా చూస్తే ఇప్పుడు తమకు కలిగిన నష్టాలపై లోక్‌సభలో వాయిదా తీర్మానంప్రవేశపెట్టారు. అంతేగాక అవసరమైతే కోర్టుకు కూడా వెళ్లి న్యాయపోరాటం చేస్తామంటున్నారు. బిసి రిజర్వేషన్లపైనా ప్రధాని సానుకూల హామీ ఇచ్చారన్నారు. మళ్లీ అవసరమైతే కోర్టుకు వెళతామంటున్నారు. ఇంత తొందరపాటు ఆవసరమా? ఈ అస్పష్టతను ఎలా అర్థం చేసుకోవాలి?