నంద్యాలలో ప్రతిపక్ష నేత జగన్ బహిరంగ సభ తరువాత పరిస్థితి అంతా తమకు అనుకూలంగా మారిందని నేతలు భావిస్తున్నారు. ఉప ఎన్నికలో తమ గెలుపు నల్లేరు మీద నడక అనే ధీమాతో నేతలు ఉన్నారు. కానీ, సభ విజయవంతం అయినంత మాత్రాన సరిపోదు అనే భావన శిల్పా మోహన్ రెడ్డి వర్గంలో వినిపిస్తోంది! ముఖ్యంగా మైనారిటీలు ఎటువైపు మొగ్గు చూపుతారనేదే కీలకంగా మారింది. వైకాపా అభ్యర్థిగా బరిలోకి దిగిన శిల్పా మోహన్ రెడ్డిని మైనారిటీ వర్గం క్షమించి, ఆదరిస్తుందా..? గతానుభవాలను మరిచిపోయి శిల్పాకు ఓట్లు వేసే అవకాశం ఉందా..? ప్రతిపక్ష నేత జగన్ కురిపించిన హామీలు, పలికి హిత వాక్యాలు మైనారిటీల్లో ఆగ్రహం చల్లారేందుకు సరిపోతాయా..? ప్రస్తుతం నంద్యాల వైకాపాలో వర్గాల్లో వాడీవేడిగా జరుగుతున్న చర్చ ఇదేనని తెలుస్తోంది.
ఇంతకీ, మైనారిటీలకూ శిల్పా మోహన్ రెడ్డి వర్గానికి గతంలో ఎక్కడ తేడా కొట్టిందనేగా అనుమానం..? అదే పాయింట్ కి వద్దాం. ప్రస్తుతం వైకాపా అభ్యర్థిగా ఉప ఎన్నికల బరిలోకి దిగిన శిల్పా… కొద్దిరోజులు కిందటి వరకూ తెలుగుదేశం పార్టీలో ఉండేవారన్న సంగతి తెలిసిందే. టీడీపీలో ఉండగా ఆయన మైనారిటీల పట్ల వ్యవహరించిన వైఖరి వేరేలా ఉండేది! గతంలో తనకు ఓట్లు వేయలేదన్న ఉద్దేశంతో మైనారిటీల పట్ల కఠినంగా వ్యవహరించిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అంతేకాదు, భూమా నాగిరెడ్డి వర్గీయులైన మైనారిటీల విషయంలో మరింత తీవ్రంగా వ్యవహరించారనీ, వారిపై లేనిపోని కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారనీ, కొంతమందిపై రౌడీ షీట్లు కూడా నమోదు చేయించారనే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. దీంతో శిల్పా వర్గంపై మైనారిటీల్లో బాగా వ్యతిరేకత వచ్చేసింది. వైకాపా అభ్యర్థిగా శిల్పాను ప్రకటించిన తరువాత ఈ విషయం పార్టీ అధినాయకత్వానికి తెలిసింది. వారు చేయించుకున్న ఓ సర్వేలో కూడా ఇదే విషయం స్పష్టమైనట్టు సమాచారం.
మైనారిటీల్లో ఉన్న వ్యతిరేక భావన తగ్గించాలనే ఉద్దేశంతోనే నంద్యాల బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి కొంతసేపు వారి గురించే మాట్లాడారు. అంతేకాదు, ఒక ఎమ్మెల్సీ పదవిని ఆ వర్గానికే కేటాయించబోతున్నట్టు హామీ ఇచ్చారు. మైనారిటీల అభ్యున్నతి కోసం తెలుగుదేశం సర్కారు ఏమీ చేయడం లేదని చిత్రించే ప్రయత్నం చేశారు. ఇదంతా శిల్పా వర్గంపై ఉన్న వ్యతిరేకతను తుడిచే ప్రయత్నంగా కనిపిస్తుంది. అయితే, జగన్ ఇచ్చిన హామీలు ఆ వర్గంపై పెద్దగా పనిచేసినట్టుగా లేవనే అభిప్రాయం నంద్యాల వైకాపా వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో శిల్పా వర్గం కాస్త కలవరంగా ఉందనీ, ఈ పరిస్థితి ని తెలుగుదేశం తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమౌతోంది. ఇప్పటికిప్పుడు ఏదో ఒకటి చేసి, మైనారిటీల మన్ననలు మళ్లీ పొందాలని శిల్పా తాపత్రయపడుతున్నారట!
కక్ష సాధిస్తే వ్యతిరేకుల్ని పెంచుకున్నట్టు అవుతుంది, అధికారం ఉన్నప్పుడు వైరి వర్గాలకూ మేలు చేస్తే అభిమానులను పెంచుకున్నట్టు అవుతుంది! ఈ చిన్న లాజిక్ ను శిల్పా ఎందుకు అర్థం చేసుకోలేకపోయారో..!