తెలుగు బిగ్ బాస్ షోలో పెద్ద సంచలనాలేం లేవు గానీ – తమిళ వెర్షన్ మాత్రం హాట్ హాట్ గా సాగుతోంది. కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో ముందు నుంచీ వివాదాస్పదమే. ఈ షోపై లెక్కలేనన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి. దానికి తోడు ఈ షోలో పాల్గొంటున్న ఓ కంటెస్టెంట్ ఆత్మహత్యాయత్నం చేసిందన్న వార్త తమిళ నాట కలకలం సృష్టిస్తోంది. ఈ షోలో ఇస్తున్న టాస్క్‌లను పూర్తి చేయడంలో విఫలమైన వాళ్లంతా మానసికంగా కృంగిపోతున్నారని, అది వాళ్ల ప్రవర్తనపై ప్రభావం చూపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. టీవీ చూస్తున్న వాళ్లు కూడా మానసికంగా ప్రభావితం అవుతున్నారని, వాళ్లపైనా పరోక్షంగా బిగ్ బాస్‌షోలు చెడు ప్రభావం చూపిస్తున్నాయన్నది విశ్లేషకుల వాదన. ఇటీవల తమిళ బిగ్ బాస్ లో కంటెస్టెంట్లు మానసిక వికలాంగులుగా నటించాల్సవచ్చింది. దీనిపైనా పెద్ద దుమారం రేగుతోంది. వికలాంగుల్ని ఇది అవమాన పరచడమే అంటూ సోషల్ మీడియాలో ఈ షోని ఏకి పరేస్తున్నారు.
కమల్‌హాసన్ కూడా దీనిపై స్పందించాడు. ఇలాంటి టాస్క్‌లు ఇవ్వడం ఏమిటని మండిపడ్డాడు. ఇక మీదట ఎవరినైనా కించపరిచేలా టాస్క్‌లు ఇస్తే.. ఈ షో నుంచి తప్పుకొంటానని హెచ్చరించాడు కమల్. వికలాంగుల పట్ల తనకు చాలా గౌరవం ఉందని, వాళ్లని ఎప్పుడూ కించపరచలేదని, ఒకవేళ తన సినిమాలో వికలాంగుల్ని చూపించినా, వాళ్లని హీరో స్థాయి పాత్రలోనే చూపించానని చెబుతున్నాడు. మొత్తమ్మీద ఈ కాంట్రవర్సీల పుణ్యమా అని బిగ్ బాస్‌కి ఊపొచ్చింది. టీవీ రేటింగులూ అమాంతం పెరుగుతున్నాయి. బిగ్ బాస్ లక్ష్యం ఇదే కదా..!