తెలుగుదేశం జాతీయ అద్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంత కాలంగా తెలంగాణలో పార్టీ పెరుగుదలపై దృష్టి పెట్టడం లేదనే ఫిర్యాదు వుంది. రాష్ట్ర విభజన తర్వాత తొలిదశలో ఆయన వారం చివరలో హైదరాబాదు వస్తుంటానని ప్రకటించారు. కొంతకాలం అలాగే చేశారు కూడా. అయితే ఓటుకు నోటు కేసు, మరికొన్ని వివాదాల నేపథ్యంలో దాదాపుగా అమరావతికి తరలిపోయారు. అక్కడ కూడా వేగంగా నిర్మాణాలు ప్రణాళికలు పూర్తి చేయాలన్న కారణం చూపించారు. టిటిడిపి నేతలే విజయవాడ వెళ్లి సంప్రదింపులు జరుపుతూ వస్తున్నారు. లోకేశ్ కూడా మంత్రి అయ్యాక ఆయన భార్య బ్రాహ్మణి వారం చివరలో కుమారుడితో అక్కడకు వెళ్లడం లేకుంటే తనే రావడం ఏదో ఒకటి చేస్తుంటారట. హైదరాబాదులో తన పాత ఇంటిని కూడా కూల్చివేసి భారీ ఎత్తున అవసరాలకు తగినట్టుగా ఆధునీకరించి కట్టిస్తున్నారు చంద్రబాబు. కాని మీ అద్యక్షుడే మిమ్మల్ను పట్టించుకోవడం లేదని టిటిడిపి నేతలను వ్యతిరేకులు దెప్పిపొడుస్తున్నారట. ఎన్నికల ఏడాది దగ్గరకు వస్తున్న పరిస్థితిమరోవైపు. ఇవన్నీ కలిసి చంద్రబాబు మరోసారి భాగ్యనగరానికి వారాంతపు సందర్శనలు పునరుద్ధరిస్తున్నట్టు సమాచారం. కుటుంబంతో గడపడం, వ్యాపార ప్రతినిధివర్గాలను కలుసుకోవడంతో పాటు టిటిడిపి వ్యూహ రచనకు సహకరించి కొంతవరకైనా ఉనికిని కాపాడుకోవడానికి కృషి చేయాలని ఆయన అభిప్రాయపడుతున్నట్టు ఆ మేరకు తెలంగాణ నేతలకు హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు.