టిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాధాన్యతే లేని కారణంగా కేంద్ర మంత్రి పదవులు వెతుక్కుంటూ అయిదారుగురు ఎంపిలు బిజెపిలో చేరతారని వార్తలు ఒకవైపు వస్తుంటే మరోవైపు కాంగ్రెస్ పాత కాపుల ఘోష కలకలం రేపుతున్నది. తెలంగాణ ఏర్పాటుకు కాస్త ముందు తర్వాత కాంగ్రెస్ హేమాహేమీలెందరో టిఆర్ఎస్లో చేరిపోయారు. ఎవరో ఎందుకు సాక్షాత్తూ ఉమ్మడి రాష్ట్ర పిసిసి అద్యక్షులైన డి.శ్రీనివాస్, కె.కేశవరావు వంటి వారే ఇప్పుడు టిఆర్ఎస్లో వున్నారు. వీరిలో కెకెకు సెక్రటరీ జనరల్ అనే బిరుదు కూడా వుంది. అయితే అది పార్టీ ప్లీనరీల్లో ప్రారంభ వచనాలు పలకడానికే పరిమితమైంది. ఆయన కుమారుడికి ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిన మాట నిజమే గాని కెకె స్థాయికి అదేం పెద్ద గొప్ప కాదు. పైగా మియాపూర్ భూభాగోతంలో కావాలనే తనను అభాసు పాలు చేశారని ఆయన సందేహం. ఇక డి.శ్రీనివాస్‌కు సలహాదారు పదవి దక్కింది గాని సలహాలు తీసుకునే పరిస్తితి లేకపోయింది. మరో ఎంపి సుఖేందర్ రెడ్డి ఆఖరివరకూ కెసిఆర్ పట్ల విమర్శనాత్మకంగా వుండి మంత్రి పదవి ఇస్తారనే అంచనాతో టిఆర్ఎస్లో చేరిపోయారు. ఇప్పటి వరకూ ఆయనకు దక్కింది కూడా శూన్యవేనని అనుచరులు వాపోతున్నారు. ఈ జాబితాలో ఇంకా కొందరు మాజీ ప్రస్తుత ఎంఎల్‌సిలు, ఎంఎల్ఎలు కూడా వున్నారు. తమాషా ఏమంటే వీరిని సంతృప్తిపర్చడం లేదు గాని కొత్తగా మరికొంతమందిని ఆకర్షించే పాచికలు మాత్రం వేస్తున్నారట. ఇలాటి పరిస్థితుల్లో పార్టీ మారినందుకు మేమేం సాధించామని వీరు ఆవేదన చెందుతున్నారు.తమ కంటే చాలా జూనియర్లయిన టిఆర్ఎస్ మంత్రుల దగ్గర చేతులు కట్టుకుని నిలబడ్డం, కెసిఆర్ కుటుంబం నిర్ణయాలు తీసుకుంటుంటే ప్రేక్షక పాత్ర వహించడం తప్ప మరేమీ మిగిలిందని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌లో దూకుడు, ప్రతిపక్షాల కదలిక పెరిగేకొద్ది ఇలాటి అసంతృప్త జీవులుకొందరైనా భవిష్యత్తును పునరాలోచించుకోవచ్చనే మాట వినిపిస్తున్నది. కేవలం ఎంఎల్ఎలుగానో ఎంపిలుగానో వుండటానికి సిద్ధంగా లేని వారు కూడా మెరుగైన అవకాశాలు వెతుక్కుంటూ మంతనాలు జరుపుతున్నారనేది వాస్తవం.