రెండు దఫాలుగా రాజ్యసభకు ఎన్నికవుతూ చర్చలను రాజకీయ వివాదాలను ప్రభావితం చేసిన సీతారాం ఏచూరి పదవీ కాలం ముగిసిపోవడం ఒక పెద్ద వెలితిగానే వుంటుందని చాలా మంది రాజకీయ నేతలు వ్యాఖ్యాతలు పేర్కొంటున్నారు. సిపిఎం ప్రధాన కార్యదర్శిగా వున్న ఏచూరి తమ పార్టీ నియమావళి ప్రకారమే మూడోసారి పోటీ నుంచి దూరంగా వుండిపోయారు. దీనికి చాలామంది స్వంత భాష్యాలు జోడించారు గాని సిపిఎంలో చాలా కాలంగా ఇది జరుగుతున్నదే. పార్టీగా నామినేట్ చేసే అవకాశం వున్న పదవులకు రెండుసార్లకు మించి వుండకూడదని ఒక నిబంధన. అంతేగాక జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ కూడా ప్రధాన పార్టీ బాధ్యతల్లో వుండే వారు చట్టసభలకు వెళ్లడం వల్ల బాధ్యతల నిర్వహణ దెబ్బతింటుందనేది మరో నియమం. అందుకే ఇప్పటి వరకూ సిపిఎం ప్రధాన కార్యదర్శులైన వారెవరూ చట్టసభల ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎన్నిక నాటికే పదవిలో వుంటే ఆ మిగిలిన కాలం పూర్తి చేశారు. గత మూడేళ్లుగా ఏచూరి కూడా అందుకే కొనసాగారు. పైగాబెంగాల్లో ఇప్పుడు మారిన బలాబలాల ప్రకారం ఆయన వైదొలగితే ఆ సీటు తృణమూల్ కాంగ్రెస్ కైవశమయ్యేది. కనుక పదవీ కాలం పూర్తి చేసి వైదొలగారు.అలా గాక ఆయనే మరోదఫా వుండటమంటే అత్యున్నత నాయకుడే నియమావళిని ఉల్లంఘించినట్టేయ్యిది. పైగా ఇందుకు కాంగ్రెస్ మద్దతు తీసుకోవడం కూడా సిపిఎం విధానానికి విరుద్ధం. ఇలాటి మూడు ముఖ్యమైన కారణాలు అందరికీ కనిపిస్తుంటే ఏవో అంతర్గత కలహాల వల్ల అలా జరిగిందని చెప్పడం అర్థం లేనిది. కరణ్‌థాపర్ ప్రత్యేకంగా రాస్తూ కపిల్‌సిబాల్, చిదంబరం వంటి వారు కూడా బాగానే మాట్లాడినా ఏచూరి అంత పదునుగా వెంటవెంటనే స్పందించలేరని వ్యాఖ్యానించారు. ఎగువ సభలో ప్రతిపక్షాల బలం తగ్గి వెంకయ్య నాయుడు సభ చైర్మన్‌గా వస్తున్న ఈ సమయంలో ఏచూరి లేకపోవడం ఒక లోటేనని కరణ్ అంటాడు. అయినా తప్పదు కదా..